అటవీశాఖ అధికారిపై దాడి
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ సెక్షన్ అధి కారి సాంబయ్యపై దాడి జరిగినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజర్ రవికుమార్ తెలిపారు. రంగపేట అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా సాంబయ్య అడవిలోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి గొడ్డలితో కన్పించగా సాంబయ్య అతడిని మందలించాడు. దీంతో కోపంతో రాకేశ్ గొడ్డలితో సాంబయ్యపై దాడిచేశాడని, ఘటనలో సాంబయ్య చేతివేళ్లకు గాయాలయ్యాయని తెలిపారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
రాయికల్: రాయికల్ పట్టణంలో ఓ బాల్య వివాహాన్ని 1098 ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పట్టణానికి చెందిన అబ్బాయి, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి వధూవరుల వయసును పరిశీలించారు. వధువు వయసు తక్కువగా ఉండటంతో మేజర్ అయ్యేంత వరకు వివాహం చేయొద్దని 1098 కౌన్సిలర్ శ్రీనివాస్, సోషల్ వర్కర్ రాణి, గంగాధర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మావతి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వివాహం వాయిదా పడింది.
షార్ట్‌సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధం
జగిత్యాలక్రైం:జగిత్యాల పట్టణంలోని చిలుకవాడలో తాళం వేసిన ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు అంటుకుని సామగ్రి దగ్ధమైంది. చిలుకవాడకు చెందిన దామెర తిరుపతి తన భార్య లక్ష్మీతో కలిసి గురువారం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. సాయంత్రం 7.30 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సకాలంలో చేరుకుని మంటలు ఆర్పేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న సామగ్రి, నిత్యావసర వస్తువులు, బట్టలు కాలిపోయాయి.
అటవీశాఖ అధికారిపై దాడి


