బుధవారంపేటను స్వాధీనం చేసుకోవాలి
రామగిరి(మంథని): సింగరేణి సంస్థ ఓసీపీ–2 విస్తరణలో భాగంగా బుధవారంపేట గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం సర్వేకు వచ్చిన సింగరేణి అధికారులను వారు అడ్డుకున్నారు. సుమారు 15ఏళ్లుగా సింగరేణి సంస్థ తమ గ్రామంపై వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. తమ పంచాయతీ పరిధిలోని మొత్తం వ్యవసాయ భూములు, గ్రామాన్ని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుని మెరుగైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్‌అండ్‌ఆర్ ద్వారా అన్ని వసతులతో కొత్త గ్రామాన్ని నిర్మించి తగిన న్యాయం చేయకుంటే సింగరేణి సంస్థ నిర్వహించే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని సౌకర్యాలు కల్పిస్తేనే సర్వేకు సహకరిస్తామని తేల్చిచెప్పారు. అప్పటివరకు అధికారులు, సింగరేణికి సహకరించేది లేదని హెచ్చరించారు. చేసేదిలేక సర్వేకు వెళ్లిన అధికారులు వెనక్కి వచ్చేశారు.


