ధాన్యం కొనేదెప్పుడో..! | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనేదెప్పుడో..!

Nov 3 2025 6:26 AM | Updated on Nov 3 2025 6:26 AM

ధాన్యం కొనేదెప్పుడో..!

ధాన్యం కొనేదెప్పుడో..!

● కేంద్రాల ప్రారంభానికే పరిమతం ● పేరుకుపోతున్న ధాన్యం రాశులు ● 408 సెంటర్లకు అనుమతులు ● 40 మిల్లులకు ధాన్యం కేటాయింపు తేమ శాతం వస్తేనే కాంటా వేస్తాం

ధాన్యం సేకరణ కోసం జిల్లాలో 408 కొనుగోలు కేంద్రాలకు అనుమతులు మంజూరయ్యాయి. కొన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. వర్షాల నేపథ్యంలో ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోంది. త్వరలోనే తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.

– జితేంద్రప్రసాద్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

జగిత్యాలరూరల్‌: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. కేవలం కేంద్రాలను ప్రారంభిస్తున్న అధికారులు అనంతరం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఓ వైపు మబ్బులు కమ్ముకుని.. ఎప్పుడు వర్షం పడుతుందో..? ధాన్యం ఎక్కడ తడిసిపోతుందో..? అని రైతులు భయాందోళన చెందుతున్నా.. అధికారుల్లో మాత్రం అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా.. జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వ్యవసాయాధికారుల అంచనా ప్రకారం వానాకాలం 6.60 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. అధికారులు మాత్రం 4 నుంచి 5లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. దీనికి తగినట్లు జిల్లాలో 436 కొనుగోలు కేంద్రాలకు దరఖాస్తులు రాగా అధికారులు స్థల పరిశీలన.. ఏర్పాట్లు చూసి ఇప్పటివరకు 408 సెంటర్లకు అనుమతి ఇచ్చారు. ఐకేపీ ఆధ్వర్యంలో 130, సహకార సంఘాల ఆధ్వర్యంలో 277, మెప్మా ద్వారా ఒక కేంద్రానికి అనుమతి లభించింది.

ప్రారంభానికే పరిమితం

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను 15 రోజులుగా ప్రారంభిస్తున్నా ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలోనూ ఒక్క క్వింటాల్‌ ధాన్యం కూడా తూకం వేయలేదు. దీంతో 20 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి పడిగాపులు కాస్తున్నారు. టీవల కురిసిన భారీ వర్షాలకు దాదాపు 60 శాతం ధాన్యం తడిసిపోయింది. శుక్రవారం నుంచి వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో రైతులు ధాన్యం ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

అందుబాటులో 60 లక్షల గన్నీ సంచులు

జిల్లాలో 4 నుంచి 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కోసం 1.50 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం. ఇప్పటికే 60 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు. కొన్ని ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలకు బ్యాగులు ఇప్పటికే సరఫరా చేశారు. మిగతా బ్యాగులు వెంటనే తెప్పించి కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

40 మిల్లర్లకు ధాన్యం కేటాయింపు

వానాకాలంలో సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు అప్పగించాల్సి ఉండగా.. ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయిస్తామని ప్రకటించింది. ఈ లెక్కన ఇప్పటివరకు జిల్లాలోని 25 రైస్‌మిల్లర్లు మాత్రమే బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చారు. మరో 15 మంది మిల్లర్లు రెన్యువల్‌ చేసుకున్నారు. ఇలా మొత్తం 40 మిల్లర్లకు అధికారులు ధాన్యం కేటాయింపు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement