దివ్యాంగులకు దిక్కేది? | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు దిక్కేది?

Oct 31 2025 7:34 AM | Updated on Oct 31 2025 7:34 AM

దివ్య

దివ్యాంగులకు దిక్కేది?

ఈమె ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటకు చెందిన యువతి ఉమలత. ఈమె తల్లి లక్ష్మి(54) ఐదేళ్ల క్రితం పత్తిచేనులో పనిచేస్తూ కిందపడిపోవడంతో నడుం విరిగింది. ఆర్థిక పరిస్థితులతో ఖరీదైన వైద్యం చేయించకపోవడంతో మంచానికే పరిమితమైంది. దివ్యాంగుల కోటాలో ఆసరా పింఛన్‌ కోసం ఐదేళ్ల క్రితం సిరిసిల్లకు రాగా.. 31శాతమే అంగవైకల్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పెన్షన్‌కు అర్హత సాధించలేదు. కూలీ పనులు చేసుకునే లక్ష్మి మంచానికే పరిమితమవడంతో ఆమె భర్త మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో లక్ష్మి భారాన్ని ఆమె కూతురు ఉమలతపై పడింది. కూలీ పనులకు వెళ్తూ పీజీ పూర్తి చేసిన ఉమలత.. తల్లికి పెన్షన్‌ వస్తే ఆసరాగా ఉంటుందని భావించి దరం శిబిరం కోసం స్లాట్‌ బుక్‌చేసినా నాలుగేళ్లుగా రిజెక్టు అవుతూ వస్తోంది. మరోసారి సదరంలో అవకాశం కల్పించి, తన తల్లికి దివ్యాంగుల సర్టిఫికెట్‌ ఇవ్వాలని వేడుకుంటుంది.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వం పెన్షన్‌ అందిస్తోంది. ఇందుకు సదరం సర్టిఫికెట్‌ అవసరం. అయితే జిల్లాలోని చాలా మందికి సదరం సర్టిఫికెట్‌ రావడం లేదు. ఏళ్ల క్రితం సదరం శిబిరానికి హాజరై కొన్ని కారణాలతో దరఖాస్తు రిజెక్టు అయిన వారు జిల్లాలో వందలాది మంది ఉన్నారు. వీరు తర్వాత ఎన్నిసార్లు సదరం శిబిరానికి దరఖాస్తు చేసుకున్నా రిజెక్టు అవుతోంది. ఫలితంగా దివ్యాంగ సర్టిఫికెట్‌ లేక ప్రభుత్వం అందించే పెన్షన్‌ డబ్బులకు దూరమవుతున్నారు. ఇలాంటి బాధితులు జిల్లాలో వందలాది మంది ఉన్నారు.

అంగవైకల్యం నిర్ధారణ ఇలా..

జిల్లాలో చెవిటి, మూగ, అంధత్వం, కాళ్లు, చేతులు, మానసిక దివ్యాంగులు ఉన్నారు. సదరం శిబిరంలో అర్హత సాధించి సర్టిఫికెట్‌ ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వం ప్రతీ నెల రూ.4వేల పెన్షన్‌ అందిస్తోంది. ఆర్టీసీ, రైల్వే వంటి వాటిలో రాయితీ లభిస్తోంది. ప్రభుత్వ విద్య, ఉపాధి, ఉద్యోగాలలో రిజర్వేషన్‌ కోటా అములులో ఉంది. సదరం సర్టిఫికెట్‌కు చాలా మంది స్లాట్‌ బుక్‌చేసుకోగానే వారికి ఒక తేదీ నిర్ధారించి జిల్లా ఆస్పత్రిలో సంబంధిత వైద్యులతో పరీక్షలు చేసి, వైకల్యాన్ని నిర్ధారిస్తారు. వైకల్యం తక్కువ ఉన్న వారివి తిరస్కరణకు గురవుతాయి. కొన్ని సాంకేతిక కారణాలతో రిజెక్టు అయిన వారు తిరిగి అర్హత సాధించేందుకు సదరం శిబిరానికి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. కానీ ఇలా స్లాట్‌ బుకింగ్‌కు వీరు అనర్హులు అవుతున్నారు. వీరి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో రిజెక్టు అవుతున్నాయి. ప్రభుత్వం ఒకసారి రిజెక్టు చేసిన వారికి ఐదేళ్లు లేదా మూడేళ్ల తర్వాత మరోసారి సదరం శిబిరానికి అవకాశం కల్పించాలని దివ్యాంగులు కోరుతున్నారు.

అప్పీల్‌ అవకాశం కల్పించేనా..

తిరస్కరణకు గురైన దివ్యాంగులు సదరం సర్టిఫికెట్‌ సాధించేందుకు అప్పీల్‌కు వెళ్లవచ్చు. ఆయా విభాగాలలో వైద్యులు తిరస్కరించిన పక్షంలో దివ్యాంగులు సదరం కమిషనర్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ఉండే అధికారుల వద్ద లేదా జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీవో కార్యాలయంలో మరోసారి అప్పీలు చేయవచ్చు. కానీ చాలా మంది దివ్యాంగులు డీఆర్‌డీవో చుట్టూ తిరిగి అర్హత సాధించలేకపోతున్నారు. ఇక హైదరాబాద్‌ వరకు వెళ్లి అప్పీల్‌ చేసుకునే ఆర్థిక పరిస్థిలు లేక పోవడం లేదు. జిల్లా ఆస్పత్రిలోనే అవకాశం కల్పించాలని దివ్యాంగులు కోరుతున్నారు.

దీనంగా కూర్చున్న యువకుడు ఎక్కల్‌దేవి రవి. కోనరావుపేట మండలం బావుసాయిపేట. పుట్టుకతో మానసిక దివ్యాంగుడు. ఐదేళ్ల క్రితం సిరిసిల్లలో సదరం శిబిరానికి హాజరయ్యాడు. పరీక్షల్లో రవి మానసిక వికలాంగుడిగా విఫలం కావడంతో దరఖాస్తును అధికారులు రిజెక్టు చేశారు. దీంతో కూలీ పనులు చేసే తల్లిదండ్రులు దేవవ్వ, పుట్టయ్యలు రవికి పెన్షన్‌ ఇప్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రవి పేరుతో సదరం శిబిరానికి స్లాట్‌ బుక్‌ చేస్తే తిరస్కరణకు గురవుతోంది.

దివ్యాంగులకు దిక్కేది?1
1/3

దివ్యాంగులకు దిక్కేది?

దివ్యాంగులకు దిక్కేది?2
2/3

దివ్యాంగులకు దిక్కేది?

దివ్యాంగులకు దిక్కేది?3
3/3

దివ్యాంగులకు దిక్కేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement