నిందితులకు శిక్ష తప్పదు
● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: నేరానికి పాల్పడిన వారికి న్యాయస్థానంలో శిక్ష తప్పదని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. నేర నియంత్రణ, న్యాయ నిరూపణలో పోలీసులు ఫలితాలు సాధిస్తున్నారని, ఈ ఏడాది జనవరి నుంచి 83 కేసుల్లో కోర్టు తీర్పులు వెలువడగా.. 92 మందికి జైలుశిక్ష, జరిమానా పడిందని గుర్తు చేశారు. ఐదుగురిపై 20 ఏళ్ల జైలు, ఐదుగురికి పదేళ్ల జైలు, 9 మందికి ఏడేళ్లు, ముగ్గురికి ఐదేళ్లు, ఒకరికి నాలుగేళ్లు, 8మందికి మూడేళ్లు, 9మందికి రెండేళ్లు, ఆరుగురికి ఏడాది, 26మందికి ఏడాదిలోపు చొప్పున జైలు శిక్ష పడిందన్నారు. మహిళలపై నేరాలు, మద్యం, గంజాయి, దొంగతనాలు, మోసపూరిత ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, కేసులను త్వరితగతిన దర్యాప్తు చేసి కోర్టు ముందు ఉంచుతున్నామని పేర్కొన్నారు.


