మంత్రిగారూ.. ఓ లుక్కెయరూ..! | - | Sakshi
Sakshi News home page

మంత్రిగారూ.. ఓ లుక్కెయరూ..!

May 11 2025 7:44 AM | Updated on May 11 2025 7:44 AM

మంత్ర

మంత్రిగారూ.. ఓ లుక్కెయరూ..!

సమస్యల వలయంలో ప్రభుత్వ ఆస్పత్రి

రోగులకు సరిపడా లేని బెడ్లు

శిథిలావస్థకు చేరిన భవనం

పనిచేయని ఆక్సిజన్‌ ప్లాంటు

శానిటేషన్‌ అంతంతే..

నేడు జిల్లాకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

జగిత్యాల: జిల్లాకేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రికి నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. కోరుట్ల, మెట్‌పల్లితోపాటు పొరుగు జిల్లాలైన మంచిర్యాల, లక్సెట్టిపేట నుంచి వస్తారు. జిల్లాగా ఆవిర్భవించనప్పుడు 100 పడకల ఆస్పత్రిగా కొనసాగేది. జిల్లా అయ్యాక మెడికల్‌ కళాశాల మంజూరై.. జనరల్‌ ఆస్పత్రిగా మారింది. 330 బెడ్లతో అప్‌గ్రేడ్‌ అయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సరైన వసతులు లేకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆస్పత్రికి ప్రతిరోజూ వెయ్యికి పైగా ఓపీ, 500కు పైగానే ఇన్‌పేషెంట్లు ఉంటారు. వంద పడకలకే సరిపడా నిర్మించిన ఈ భవనంలో స్థలం లేక వరండాలోనే రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. జనరల్‌ వార్డులో కూడా వసతులు సక్రమంగా లేవు. బాత్‌రూములు దుర్వాసన వెదజల్లుతున్నాయి. పైప్‌లైన్‌ తరచూ లీక్‌ కావడంతో జనరల్‌ వార్డులోకి నీరు చేరుతోంది. నేడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లాకు రానుండడంతో ఈ సమస్యలపై ఓ లుక్కు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఉన్న లేనట్లే..

కరోనా సమయంలో రోగులకు ఆక్సిజన్‌ అందించేందుకు అప్పటి ప్రభుత్వం రూ.80 లక్షలతో ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. 500ఎల్‌పీఎం సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ సెంట్రలైజేషన్‌ ద్వారా నేరుగా రోగికి ఆక్సిజన్‌ అందించే అవకాశం ఉంది. అయితే ఇది తరచూ చెడిపోతుండడం.. టెక్నీషియన్‌ లేక కొద్దిరోజులు నడవడం.. మరికొన్ని రోజులు నిరుపయోగంగా ఉంటోంది.

వైద్యులున్నా లేనట్లే..

ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో గైనకాలజిస్ట్‌లు, ఆప్తమాలజీ, సీనియర్‌ రెసిడెన్సీలు చాలామంది వచ్చారు. మౌలిక వసతులు లేక రోగులకు ఆశించిన మేర వైద్యం అందడం లేదు. రాత్రి సమయంలో ప్రమాదాల బారిన పడిన వస్తే స్ట్రెచర్‌పై బంధువులే తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వార్డుబాయ్‌లే ప్రథమ చికిత్స చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. డ్యూటీలో ఉన్న కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బర్న్‌ వార్డుల్లో ఏసీలు సక్రమంగా పనిచేయక అగ్నిప్రమాదాల్లో గాయపడిన వారు వస్తే ఇబ్బందిగా మారింది.

దొంగల భయం

ఆస్పత్రిలో దొంగల బెడద కూడా ఎక్కువైంది. సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో లేకపోవడం, సెక్యురిటీ లేకపోవడంతో రోగులను చూసేందుకు వచ్చిన బంధువుల సెల్‌ఫోన్లు, బంగారు గొలుసులు, విలువైన వస్తువులు అపహరణకు గురవుతున్నాయి. పోలీసు అవుట్‌ పోస్ట్‌లో హెడ్‌కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉండాలి. ఇక్కడ మచ్చుకై నా కన్పించడం లేదు.

కొత్త భవనం నిర్మాణం ఎప్పుడో...

ఆస్పత్రి సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించింది కావడంతో శిథిలావస్థకు చేరింది. పైప్‌లైన్లు తరచూ లీక్‌ అవుతున్నాయి. శానిటేషన్‌ అస్తవ్యస్తంగా మారింది. వర్షకాలంలో జనరల్‌ వార్డుల్లో పెచ్చులూడి రోగులపై పడుతున్నాయి. ఇటీవల మరమ్మతుల కోసం కలెక్టర్‌ రూ.29 లక్షల నిధులు మంజూరు చేశారు. వీటిని వినియోగించి ప్రస్తుతం రంగులు వేయడంతోపాటు, డ్రైనేజీ, రెనోవేషన్‌, ప్యాచ్‌వర్క్‌లు, నూతన బెడ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. అయితే నూతన భవనమే నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇరుకు గదుల్లో డయాలసిస్‌ కేంద్రం

ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 45 మంది చికిత్స చేయించుకుంటారు. మూడు షిప్ట్‌ల్లో చేస్తున్నా.. గదులు ఇరుకుగా ఉండడంతో డయాలసిస్‌ చేయడం కష్టంగా మారింది.

అమాత్య ఆలకించు..

జనరల్‌ ఆస్పత్రిని మంత్రి రాజనర్సింహ ఆదివారం పరిశీలించనున్నారు. ఆస్పత్రికి భవన నిర్మాణం, డ్రైనేజీ సిస్టం, నూతన పరికరాలు ఏర్పాటు చేయాలని రోగులు, బంధువులు కోరుతున్నారు. డయాలసిస్‌ గదులు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందిగా మారిందని, సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మంత్రి పర్యటన ఇలా..

మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం రాత్రి ధర్మపురికి చేరుకున్నారు. ఇక్కడే బస చేయనున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు రోడ్డుమార్గంలో జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని పరిశీలించనున్నారు. 12.30 గంటలకు కలెక్టరేట్‌లో వైద్యశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయల్దేరనున్నారు.

ధర్మపురి చేరిన మంత్రి

ధర్మపురి: మంత్రి దామోదర రాజనర్సింహ ధర్మపురి చేరుకున్నారు. స్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారలను దర్శించుకుంటారు. మంత్రికి ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, కలెక్టర్‌ సత్యప్రసాద్‌, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ స్వాగతం పలికారు. నాయకులు ఎస్‌ దినేష్‌, వేముల రాజు, చీపిరిశెట్టి రాజేశ్‌ ఉన్నారు.

మంత్రిగారూ.. ఓ లుక్కెయరూ..!1
1/3

మంత్రిగారూ.. ఓ లుక్కెయరూ..!

మంత్రిగారూ.. ఓ లుక్కెయరూ..!2
2/3

మంత్రిగారూ.. ఓ లుక్కెయరూ..!

మంత్రిగారూ.. ఓ లుక్కెయరూ..!3
3/3

మంత్రిగారూ.. ఓ లుక్కెయరూ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement