
● అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు.. ● ఐదుగురితో కమిటీ ● ఉ
జగిత్యాల/పెగడపల్లి: ఉపాధిహామీ పథకంలో అవినీతి అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఊరూర నిఘా కమిటీ వేయాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉపాధి పథకాల్లో అనేక అక్రమాలు జరగడం, సామాజిక తనిఖీల్లో బయటపడడం సాధారణంగా మారింది. తనిఖీల్లో అవకతవకలు బయటపడుతున్నా రికవరీ చేయడం లేదన్న ఆరోపణలున్నాయి.
ఐదుగురు సభ్యులతో..
● కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు పారదర్శకంగా నిఘా కమిటీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కమిటీలో ఐదుగురు సభ్యులుంటారు.
● సభ్యుల కాలపరిమితి ఆరునెలలు, అనంతరం వేరే కమిటీని ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టినప్పుడు, తీర్మానం చేసేటప్పుడు కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. కూలీలు హాజరవుతున్నారా, చెల్లింపులు తదితర వివరాలను గుర్తించి మండల అధికారులకు నివేదిక అందజేస్తారు.
● అనంతరం జిల్లా అధికారుల నుంచి నివేదిక కలెక్టర్‌కు వెళ్తుంది. ప్రతినెలా మొదటి వారంలో తనిఖీలు నిర్వహించి గ్రామాల్లో ఏయే పనులు చేపట్టారు అనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
● అలాగే సామాజిక తనిఖీల్లో బయటపడ్డ నిధులను రికవరీ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈ కమిటీలతో కొంత మేర అవకతవకలు జరగకుండా అడ్డుకట్ట పడే అవకాశాలుంటాయి.
● గ్రామపంచాయతీల్లో చేపట్టే తీర్మానాల్లో కమిటీ సభ్యులు ఉంటారు. అవకతవకలు జరిగినా, ఉపాధి కూలీలను మోసంచేసినా చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి.
● కాగా జిల్లాలో ఉపాధి పథకం ప్రారంభం నుంచి రూ.కోట్లలో రికవరీ కావాల్సి ఉంది. కమిటీల ఏర్పాటుతో అవి వచ్చే అవకాశాలుంటాయి.
● అధికారులకు ఆర్వోఆర్ చట్టం (రికార్డ్స్ ఆఫ్ రైట్స్) ఆస్తుల జప్తు అధికారాలు ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కమిటీల ఏర్పాటుతో ఉపాధి పనులు పకడ్బందీగా జరిగే అవకాశాలున్నాయి.
జాబ్ కార్డులకు బ్రేక్
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించడంతో గ్రామాల్లో ఉపాధి పథకం జాబ్ కార్డులకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం తాత్కాలికంగా ఆత్మీయ భరోసా కింద కొత్తకార్డులు జారీ చేయొద్దనే ఆదేశాలతో కొద్దిరోజులుగా కొత్త జాబ్ కార్డులతో పాటు సవరణ, తొలగింపులు నిలిపి వేశారు. కాగా, ఆత్మీయ భరోసా పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుండడంతో ప్రత్యేకంగా వేర్వేరు జాబ్‌కార్డులు జారీ చేయాలన్న డిమాండ్ గ్రామాల్లో పెరిగింది. ప్రస్తుతం సవరణకు అవకాశం లేకపోవడంతో అర్హుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కనీసం ఏడాదిలో 20 రోజులు పనిచేసిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొనడంతో గ్రామాల్లో పనులకు వెళ్లే కూలీల సంఖ్య పెరగనుంది.
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)
జాబ్‌కార్డులు : 1.67 లక్షలు
మొత్తం కూలీలు : 2.70 లక్షలు
జిల్లాలో..