సేంద్రియ ఎరువులకు డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

సేంద్రియ ఎరువులకు డిమాండ్‌

Published Mon, May 27 2024 1:15 AM

సేంద్

● కోడి ఎరువు లారీ లోడ్‌కు రూ.28 వేల నుంచి రూ.30 వేలు ● హైదరాబాద్‌ నుంచి జిల్లాకు సరఫరా

జగిత్యాలఅగ్రికల్చర్‌: గతంలో ప్రతి రైతుకు ఎడ్లు, బర్లు, ఆవులతో పాటు మేకలు, గొర్రెలు కూడా ఉండేవి. అవి విసర్జించే మల, మూత్రాలను పంటలకు సేంద్రియ ఎరువులు గా వేసేవారు. ఇప్పుడు, గ్రామాల్లో ఆ పరిస్థితి లేకుండాపోయింది. దీంతో పంటలకు అవసరమైన పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువులను ఆవుల, కోళ్ల ఫారాల నుంచి తెప్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఈ ఎరువులకు ఏటా డిమాండ్‌ పెరిగి రైతులకు అందకుండా పోతున్నాయి.

ఏటా 800– 1000 లారీల కోడి ఎరువు

హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల కోళ్ల ఫారాల నుంచి జిల్లాకు ఏటా 800–1000 లారీల కోడి ఎరువు వస్తుంటుంది. ఆదిలాబాద్‌లోని జన్నారం, ఊట్నూర్‌ ప్రాంతాల నుంచి మరో 200 లారీల పశువుల ఎరువు తెప్పించుకుంటారు. దీనికి తోడు రోజుకు రూ.2000– రూ.3000 ఇచ్చి పంట భూమిలో రోజుల తరబడి గొర్రెల మంద పెట్టిస్తుంటారు. జిల్లాలో ఎక్కువగా పసుపు పంట వేస్తుండటంతో సేంద్రియ ఎరువుల అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు రెండెకరాలకు ఒక్క లారీ చొప్పున కోళ్ల ఎరువును తెప్పిస్తుంటారు.

పెరుగుతున్న ధరలు

సేంద్రియ ఎరువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక్క లారీ లోడ్‌ కోడి ఎరువు ధర రూ.28– రూ.30 వేల వరకు ఉంది. పశువుల ఎరువు లారీ లోడ్‌ రూ.25– రూ.26 వేలు, గొర్రెల ఎరువు సైతం రూ.29– రూ.30 వేలు పలుకుతుంది. పంటల సీజన్‌ దగ్గరకు వచ్చేసరికి మరింత రేటు పలుకుతోంది. లారీల్లో వచ్చిన ఎరువును తోటల్లో చల్లడానికి మరో రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. ఒక్కో రైతు కనీసం కోళ్ల ఎరువుకే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు.

అనేక పోషకాలు

సేంద్రియ ఎరువుల్లోనే మొక్కకు అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఏడాదికి ఒక గేదె నుంచి 7 టన్నులు (14 ఎడ్ల బండ్లు)పేడ, 2,500 లీటర్ల మూత్రం వస్తుంది. దీని ప్రకారం ఒక గేదె పేడతో ఏడాదికి 27.21 కిలోల నత్రజని (55 కిలోల యూరియాతో సమానం), 13.60 కిలోల భాస్వరం (85 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌తో సమానం), 6.8 కిలోల పోటాష్‌ (12 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పోటాష్‌తో సమానం) ఉంటాయి. అలాగే ఒక్క పశువు మూత్రంలో 29.16 కిలోల నత్రజని, 39.56 కిలోల పోటాష్‌, కొద్ది మొత్తంలో భాస్వరం ఉంటాయి. దీని ప్రకారం ఏ పంటకై నా, ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా పశువులు, కోళ్ల ఎరువు వేసి పంటలు పండించే అవకాశం ఉంది.

సేంద్రియ ఎరువులకు డిమాండ్‌
1/1

సేంద్రియ ఎరువులకు డిమాండ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement