
మాట్లాడుతున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు
ధర్మపురి : కాంగ్రెస్ కౌన్సిలర్లపై అధికార పార్టీ కౌన్సిలర్లు చేసిన వ్యక్తిగత దూషణలకు నిరసనగా మున్సిపల్ సాధారణ సమావేశాన్ని బహిష్కరించినట్లు కాంగ్రెస్ కౌన్సిలర్లు తెలిపారు. ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం చైర్‌పర్సన్ సంగి సత్తమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. కమిషనర్ రమేశ్, ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు అధికార పార్టీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే కాంగ్రెస్ కౌన్సిలర్లు జక్కు పద్మ, సంగనభట్ల సంతోషి, గరిగె అరుణపై చైర్ పర్సన్, వైస్ చైర్మన్, అధికార పార్టీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా దాడి చేశారంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు వాపోయారు. మూడురోజుల కింద నిర్వహించిన మున్సిపల్ సమావేశానికి తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని, మహిళా కౌన్సిలర్లకు బదులుగా వారి భర్తలు సమావేశానికి ఎలా అనుమతించారంటూ ప్రశ్నించారు. సమావేశంలో ప్రతి అంశంపై ప్రశ్నించే హక్కు ఉంటుందని కాంగ్రెస్ కౌన్సిలర్ సంతోషి అన్నారు. తాగునీరు, వీధికుక్కల బెడద, పార్కింగ్, పెండింగ్ బకాయిలు, తదితర అంశాలపై ప్రశ్నిస్తున్నందుకు ఎదురుదాడికి దిగారన్నారు.