
మౌంట్ కార్మెల్ పాఠశాల భవనం
● మౌంట్ కార్మెల్ స్కూల్‌లో టెన్త్ వాల్యూయేషన్ సెంటర్
జగిత్యాల: జిల్లాకు పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్(మూల్యాంకనం) సెంటర్ మంజూరైంది. జిల్లా ల పునర్విభజనకు ముందునుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఉంటోంది. జిల్లాల పునర్విభజన జరిగి దాదాపు ఏడేళ్లు గడుస్తోంది. ఇప్పటిదాకా మూల్యాంకనంలో పాల్గొనే జిల్లా ఉపాధ్యాయులు అక్కడి వరకు వెళ్లివచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ఆనందరావు కలిసి స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డికి ఈ సమస్యపై తరచూ వినతిపత్రాలు అందజేశారు. దీంతో జగిత్యాల జిల్లాకు స్పాట్ వాల్యూయేషన్ సెంటర్ మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, వచ్చే ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. అదేనెల చివరివారంలో ఇక్కడే ప్రశ్నపత్రాలు దిద్దుతారు. దీంతో ఉపాధ్యాయుల ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు. కాగా, అన్ని సౌకర్యాలు ఉన్న జిల్లా కేంద్రంలోని ధరూర్ మౌంట్ కార్మెల్ పాఠశాలను స్పాట్‌వాల్యూయేషన్ సెంటర్‌కు ఎంపిక చేశారు.