World Elephant Day: వాసనలో ఎంతో షార్ప్‌.. 14 సింహాలతో పోరాడిన గున్న ఏనుగు గుర్తుందా?

World Elephant Day Special Story And Interesting Facts In Telugu - Sakshi

‘ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగూ.. అంటూ రోజూ ఒకే పాటను యూట్యూబ్​లో చూసి చూసి విసిగిపోయి ఉన్నాడు చిట్టిగాడు. ఫోన్​ పక్కనపడేసి కిచెన్‌లో ఉన్న అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ‘అమ్మా.. మంచి ఏనుగు కథ చెప్పమ్మా? అంటూ మారాం చేశాడు. చిట్టిగాడి అల్లరి భరించలేం అనుకున్న లలిత.. పద్నాలుగు సింహాలను తరిమిన గున్న ఏనుగు కథ చెప్పడం మొదలుపెట్టింది. 

అనగనగా ఒక అడవి.  ఒకనాడు ఒక గున్న ఏనుగు తన తల్లి నుంచి తప్పిపోయింది.  ఆకలితో ఉన్న ఓ సింహాల గుంపు కంట పడడంతో..  ఆ పిల్లను తరమడం ప్రారంభించాయి. ఒకేసారి 14 సింహాలను చూసినా అది భయపడలేదు. ధైర్యంగా తన శక్తిమేర ప్రాణాల కోసం పోరాడింది. అక్కడే ఉన్న వాగు నీళ్లలోకి అస్తమానం పరిగెడుతూ.. బయటకు వస్తూ సింహాలను తరిమి కొట్టింది. చేసేది ఏం లేక సింహాలు దూరంగా నిల్చుని చూస్తూ ఉండిపోయాయి.. అంటూ చెప్తూ పోతోంది. ఇంతకీ ఆ గున్న వాళ్ల అమ్మతో కలిసిందా అమ్మా? అని ఆత్రుతగా అడిగాడు చిట్టిగాడు. అయితే ఇది వాస్తవ ఘటన. ఏడేళ్ల క్రితం జాంబియా సౌత్​ లువాంగ్వా ‘నార్మన్​ కార్​’ సఫారీలో జరిగిందని వార్తలో చదివింది లలిత. ఆపద సమయంలో ధైర్యం ప్రదర్శించిన ఆ గున్న ఏనుగు పేరు ‘హెర్క్యులస్’(గ్రీకు పురాణగాథల్లో వినిపించే వీరుడి పేరు)గా ప్రపంచం మొత్తం మారుమోగిపోయింది కూడా.  ఆ వివరాలను సెల్​ఫోన్​లో వెతుకుతున్నప్పుడు.. ఇవాళ(ఆగష్టు12న) World Elephant Day అని కనిపించింది లలితకు.
   

‘చిట్టీ.. ఇవాళ వరల్డ్​ ఎలిఫెంట్ డే రా.  అంటే ఇవాళ ఏనుగుల రోజు. కాబట్టి, వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తా’ అంటూ మొదలుపెట్టింది వాళ్ల అమ్మ. 

► ఏనుగును వాళ్ల అమ్మ 22 నెలలు కడుపులో మోస్తుంది. పుట్టిన వెంటనే అవి నడుస్తాయి చిట్టీ(చిట్టీ నోరెళ్ల బెట్టి చూస్తూ.. వింటున్నాడు). అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చిన 20 నిమిషాలకే లేచి నిలబడతాయి. గంటకే నడుస్తాయి కూడా. రెండు రోజుల తర్వాత మందలో కలిసి ముందుకెళ్తాయి. అలా ఉన్నాయి కాబట్టే అవి గుంపుగా బతకగలుగుతున్నాయి. తిండి-నీళ్ల కోసం ఎంతో దూరం వెళ్లగలుగుతున్నాయి. 

చైనాలో వందల కిలోమీటర్లు ప్రయాణించిన ఏనుగుల మంద.. హాయిగా విశ్రాంతి తీసుకున్న ఫొటో

ఈ భూమ్మీద అతిపెద్ద జీవి.. ఆఫ్రికన్​ ఏనుగు చిట్టీ. పుట్టినప్పుడే వాటి బరువు 120 కేజీలు ఉంటుంది.  పెద్దవి 3 మీటర్ల ఎత్తు.. 6000 కేజీలకు పైగా బరువు ఉంటాయవి. ఏనుగులు పూర్తిగా ఎదగడానికి 35‌‌-40 సంవత్సరాల టైం పడుతుంది. అలాగే అవి 60-70 సంవత్సరాలు బతుకుతాయి.

ఈ భూమ్మీద ఏనుగులు రెండు రకాలు ఉన్నాయి చిట్టీ. ఒకటి ఆఫ్రికన్​ ఏనుగులు.. రెండోది ఆసియన్​ ఏనుగులు. ఇవే చాలా దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ‘మరి వాటిని ఎలా గుర్తుపట్టడం అమ్మా?’ అంటూ అడిగాడు చిట్టి. ఆఫ్రికన్​ ఏనుగుల తొండం చివర రెండు వేళ్ల మాదిరి ఉంటుంది. అదే ఆసియన్​ ఏనుగులకు ఒకటే ఉంటుంది. ఇక ఈ తొండంలో ఎనిమిది లీటర్ల నీళ్ల దాకా పడతాయి.  తొండం సాయంతోనే నీళ్లు తాగుతాయి. ఆహారం తీసుకుంటాయి.  స్నానాలు చేసేటప్పుడు మగ్గులా కూడా వాడుకుంటాయి.
 

ఏనుగుల శరీరంపై చర్మం చాలా భాగాల్లో మందంగా(2.5 సెంటీమీటర్ల) ఉంటుంది. దుమ్ము, బురద స్నానాలతో సూర్య కిరణాల నుంచి వేడి నుంచి తమను తాము కాపాడుకుంటాయవి.

ఏనుగులు మంచి తిండిబోతులు. రోజూలో 18 గంటలు తింటూనే ఉంటాయి.  వదిలేస్తే ఒకరోజులో 150 కేజీల ఫుడ్డు తినేస్తాయి. అందులో సగం అరగకుండానే బయటకు వచ్చేస్తుంది.  

ఏనుగుల ఎముకలు భూమి నుంచి వచ్చే శబ్దాలను కూడా గ్రహిస్తాయి తెలుసా?.. చిట్టీ. అవి మాట్లాడుకోవడం అంతా వేరేలా ఉంటుంది. ఏనుగు అరిస్తే(ఘీంకారం) మైళ్ల దూరం వినిపిస్తుంది. వీటి సాయంతోనే అవి మాట్లాడుకుంటాయి. అలాగే వాటికంటూ ఒక వాసన పెట్టుకుంటాయి. కుక్కల కంటే ఇవి వాసనను బాగా పసిగడతాయి. పేడ సాయంతో వాటి మంద ఎటు వెళ్లాయనే విషయాన్ని తెలుసుకుంటాయి కూడా.
 

ఏనుగులు ఎమోషనల్​ జీవులు. తొందరగా మనుషులతో కలిసిపోతాయి. ప్రేమగా ఉంటాయి.  జ్ఞాపకశక్తి ఎక్కువ. ఏ విషయాన్నైనా బాగా గుర్తు పెట్టుకుంటాయి.(మెదడులో ఉండే టెంపోరల్​ లోబ్​ వల్లే ఇదంతా). థాయ్​లాండ్​లో ఆ మధ్య ఒక ఏనుగు ఓ ఇంటి వంటగది పగలకొట్టి.. అంతా తినేసింది. ఆ ఏనుగు ఇప్పుడు మళ్లీ అదే ఇంటికి వచ్చి గోడను పగలకొట్టి.. మళ్లీ తినేసింది చూడు. అంత బాగా ఉంటుంది వాటికి మెమరీ. 

ఏనుగులు మచ్చిక జీవులు.  సాధారణంగా వాటికి కోపం రాదు. ఎవరైనా కవ్వించాలని ప్రయత్నిస్తేనే.. అవి ప్రతిదాడులకు దిగుతాయి. పాపం.. ఒక ఏనుగును కాపాడుకోవడానికి.. మిగతావి ప్రాణాలను పణంగా పెడుతుంటాయి కూడా. 

పాపం.. ఎంత పెద్ద జీవి అయినా ఏం లాభం. ఒకప్పుడు ఎంతో పెద్దగా ఉండే ఏనుగుల సంఖ్య.. బాగా తగ్గిపోయింది. ఆఫ్రికన్​‌‌-ఆసియన్​ ఏనుగులు చాలా తగ్గిపోయాయి(90,50 శాతాలు) ఆఫ్రికన్​ ఏనుగులు 4 లక్షల దాకా ఉండగా, ఆసియన్​ ఏనుగులు కేవలం 45 వేలే ఉన్నాయి!. అందుకే వాటిని కాపాడేందుకు ఆగష్టు 12న వరల్డ్​ ఎలిఫెంట్​ డే చేస్తున్నారు చిట్టీ. 

వాటర్‌ టబ్‌లో ఇరుకున్న గున్న ఏనుగును కాపాడే ప్రయత్నం(పాత ఫొటో)

►‘మరి ఏనుగు తెల్ల కొమ్ముల సంగతి ఏంటమ్మా?’ అంటూ అమాయకంగా అడిగాడు చిట్టి. దానికి లలిత నవ్వుతూ.. వాటిని కొమ్ములు అనరు.. దంతాలు అంటారు. అంటే నీ నోట్లో పండ్లలాంటివి.  ఏనుగులకు రెండేళ్ల నుంచి ఇవి పెరగడం మొదలవుతుంది. తినేటప్పుడు కొమ్మల్ని చీల్చడానికి, వేళ్లను పెకలించడానికి సాయపడతాయి. అంతేకాదు ఒకాదానితో మరొకటి కొట్లాడుకున్నప్పుడు ఆత్మ రక్షణ కోసం ఉపయోగించుకుంటాయి. పాపం.. వీటి కోసమే వేటగాళ్లు వాటిని చంపుతుంటారు అనడంతో ‘అయ్యో పాపం’ అంటూ జాలిగా ‘ఊ’ కొట్టాడు చిట్టీ. అన్నట్లు కథలో ముందు చెప్పుకున్న హెర్క్యులస్‌ వయసు ఇప్పుడు ఎనిమిదేళ్లు. తన మందతో ప్రశాంతంగా జీవిస్తోందని చెప్పడంతో చిట్టీ ముఖంలో నవ్వు కనిపించింది.

ఏనుగుల సంరక్షణ.. ఈ మాట వినగానే ముందు గుర్తొచ్చే దేశం థాయ్​లాండ్​. ఇక్కడ ఉన్న ఎలిఫెంట్​ రీఇంట్రడక్షన్​ ఫౌండేషన్​=కెనడా ఫిల్మ్​మేకర్​ పాట్రిసియా సిమ్స్​ కలిసి ఈ డేను 2012 నుంచి నిర్వహిస్తున్నారు. సిమ్స్​ వరల్డ్​ ఎలిఫెంట్​ సొసైటీకి అధ్యక్షురాలు కూడా.

ఏనుగుల పరిరక్షణ, వేటను అడ్డుకోవడం, వాటి దంతాల అక్రమ రవాణాను నివారించడం, జనావాస ప్రాంతాల్లో వాటి దాడులను ఎలా అడ్డుకోవడం, మదం(హార్మోనుల రిలీజ్​) టైంలో ఎలా ప్రవర్తించడం, వాటి మానాన వాటిని ఎలా బతకనివ్వడం.. ఇలాంటి అంశాలపై సుమారు 100కి పైగా పని చేస్తున్న సంస్థలు ప్రజల్లో అవగాహన నింపడానికి ప్రయత్నిస్తుంటాయి ఇవాళ.
-సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top