మాది న్యాయబద్ధమైన యుద్ధం | Vladimir Putin has expressed confidence in a victory in Ukraine | Sakshi
Sakshi News home page

మాది న్యాయబద్ధమైన యుద్ధం

May 10 2026 5:03 AM | Updated on May 10 2026 10:27 AM

Vladimir Putin has expressed confidence in a victory in Ukraine

ఉక్రెయిన్‌ దురాక్రమణదారు

దానికి నాటో సాయం చేస్తోంది

విక్టరీ డే పరేడ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యాఖ్యలు

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విక్టరీ డే పరేడ్‌ వేదికగా నాటో కూటమిపై మండిపడ్డారు. ఉకెయ్రిన్‌ను దురాక్రమణ దారుగా అభివర్ణించారు. తాము చేస్తున్నది న్యాయబద్ధమైన యుద్ధమంటూ ప్రకటించుకున్నారు. శనివారం రాజధాని మాస్కోలోని ప్రసిద్ధ రెడ్‌ స్క్వేర్‌లో జరిగిన వేడుకల్లో వందలాది మంది సైనికులను ఉద్దేశించి పుతిన్‌ ప్రసంగించారు. ‘అప్పటి విజేతలు సాధించిన గొప్ప విజయం, నేడు ప్రత్యేక సైనిక చర్య లక్ష్యాలను నెరవేరుస్తున్న సైనికులకు స్ఫూర్తినిస్తోంది’ అంటూ ఉక్రెయిన్‌తో నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. 

‘నాటో కూటమి మొత్తం ఆయుధాలను అందిస్తూ మద్దతు ఇస్తున్న ఒక దురాక్రమణ శక్తిని మన సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. మన హీరోలు ముందుకు సాగుతున్నారు’అని పుతిన్‌ పేర్కొన్నారు. సైనిక వ్యూహాలు ఎలా మారినప్పటికీ దేశ భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలేనని ఆయన వ్యాఖ్యానించారు. నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా ఈ ఉత్సవాన్ని రష్యా దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. 25 ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్న పుతిన్‌ విక్టరీ డేను దేశ ఆయుధ పాటవాన్ని ప్రదర్శించే వేదికగా మార్చుకున్నారు. అయితే, ఈసారి అటువంటివేమీ లేకుండా పరేడ్‌ సాదాసీదాగా సాగింది.

 ఉక్రెయిన్‌ దాడుల భయంతోనే భారీగా భద్రతా ఏర్పాట్లు సైతం చేపట్టారు. పెద్ద సంఖ్యలో సైనికులు రెడ్‌ స్క్వేర్‌లో కవాతు చేపట్టారు. వీరితో ఉత్తర కొరియా బలగాలు కలిసి పాల్గొనడం గమనార్హం. యుద్ధంలో బిజీగా ఉండటం వల్లే సైనికులు కవాతులో పెద్ద సంఖ్యలో పాల్గొనలేదని ప్రభుత్వం తెలిపింది. క్రెమ్లిన్‌లో జరిగిన వేడుకకు అతిథులుగా బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో, మలేసియా రాజు సుల్తాన్‌ ఇబ్రహీం, ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు షౌకత్‌ మిర్జియోయెవ్, స్లొవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికో హాజరయ్యారు. విక్టరీ డే వేడుకలు సుదూరంగా మాస్కోకు 9 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్లాడివొస్టొక్‌తోపాటు సైబీరియాలోని క్రాస్నోయార్క్‌స్, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరాల్లోనూ జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement