కనీస వేతనాలు పెంచితేనే హెచ్‌–1బీ వీసాలు!  | USA Proposes Higher Minimum Wages for H-1B Workers | Sakshi
Sakshi News home page

కనీస వేతనాలు పెంచితేనే హెచ్‌–1బీ వీసాలు! 

May 10 2026 4:51 AM | Updated on May 10 2026 4:51 AM

USA Proposes Higher Minimum Wages for H-1B Workers

ప్రస్తుత పరిమితి కంటే 30 శాతం దాకా పెంచాలి  

కంపెనీలకు అమెరికా ప్రభుత్వం సూచన  

వాషింగ్టన్‌:  హెచ్‌–1బీ వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. హెచ్‌–1బీ వీసా కార్యక్రమం కింద ఉద్యోగులను నియమించుకునేందుకు చెల్లించే కనీస వేతనాలను, గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30 శాతం దాకా పెంచాలని తాజాగా ప్రతిపాదించింది. విదేశీ ఉద్యోగులు అమెరికా ఉద్యోగుల వేతనాలను తగ్గించే పరిస్థితిని నివారించడానికి ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

ఈ కొత్త నిబంధననను అమెరికా కారి్మక శాఖ మార్చి 27వ తేదీన ప్రతిపాదించింది. ఎంట్రీ–లెవెల్‌ నుంచి మోస్ట్‌–ఎక్స్‌పీరియన్స్‌డ్‌ దాకా నాలుగు కేటగిరీల్లో కనీస వేతనాలు పెంచాలని అమెరికా కంపెనీలకు స్పష్టంచేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వేతనాలను 20 ఏళ్ల క్రితం ఖరారు చేశారు. ఇప్పుడున్న నిబంధనలు అమెరికా కారి్మకులకు రక్షణ కల్పించలేకపోతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అమెరికా కంపెనీలు హెచ్‌–1బీ వీసా పథకం కింద తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. దాంతో స్వదేశీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని అధికారవర్గాలు అంటున్నాయి. 

ప్రస్తుతం హెచ్‌–1బీ వీసాతో విదేశీయులకు ఉద్యోగం ఇవ్వాలంటే లెవెల్‌–1 వారికి ఏడాదికి కనీసం 73,279 డాలర్లు, లెవెల్‌–2 వారికి 98,987, లెవెల్‌–3 వారికి 1,21,979, లెవెల్‌–4 వారికి 1,44,202 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. కొత్త నిబంధన ప్రకారం కనీస వేతనాలు తప్పనిసరిగా పెంచాలి. అంటే లెవెల్‌–1 వారికి ఏడాదికి కనీసం 97,746 డాలర్లు(పెంపు 33.39 శాతం), లెవెల్‌–2 వారికి 1,23,212(పెంపు 24.47 శాతం), లెవెల్‌–3 వారికి 1,47,333(పెంపు 20.79 శాతం), లెవెల్‌–4 వారికి 1,75,464(పెంపు 21.68 శాతం) డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. నగరాలను బట్టి ఇందులో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి.  

ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలు కష్టమే!  
కొత్త ప్రతిపాదనలపై ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయి. అమెరికా కంపెనీలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాల్లో ఇకపై విదేశీయులను నియమించుకొనే అవకాశం లేకపోవచ్చని నిపుణులు అంటున్నారు. 

హెచ్‌–1బీతోపాటు హెచ్‌1బీ1, ఈ–3 వీసాల కింద ఉద్యోగాలు పొందే విదేశీయుల వేతనాలు కూడా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. 2020లో కనీస వేతనాల్లో మార్పులు చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నించగా, చట్టపరంగా> సవాళ్లు ఎదురయ్యాయి. దాంతో ఆ ప్రక్రియ అప్పట్లో ఆగిపోయింది. హెచ్‌–1బీ వీసాలతో ప్రధానంగా భారతీయ టెక్నాలజీ నిపుణులు ప్రయోజనం పొందుతున్నారు. అమెరికా కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. భారతీయుల తర్వాత చైనా టెక్‌ నిపుణులు ఈ వీసాలను అధికంగా ఉపయోగించుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement