భయానకం: ఉక్రెయిన్‌ బుచాలో శవాల గుట్టలు.. అత్యాచార బాధితుల శవాలు!

Ukraine Accuses Russia Behind Bucha Massacre But Moscow Denies - Sakshi

Bucha Massacre Ukraine: యుద్ధ నేరానికి దిగిన రష్యా.. నర మేధానికి పాల్పడింది!. కాళ్లు చేతులు కట్టేసి.. తలలో బుల్లెట్లు దింపిన పౌరుల ఫొటోలు, వీడియోలు ఉక్రెయిన్‌లో జరిగిన మారణహోమం తాలుకా పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. రాజధాని కీవ్‌కు ఇంతకాలం అడ్డుగోడగా నిలిచిన బుచా పట్టణంలో.. శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. మరోవైపు మహిళలపై నడిరోడ్డుపైనే అఘాయిత్యాలు జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్‌, అమెరికాలు రష్యాపై తీవ్రస్థాయిలో ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి.  

కీవ్‌కు ఈశాన్యంగా 37 కిలోమీటర్ల దూరంలో ఉంది బుచా పట్టణం. నెలరోజుల పాటు జరిగిన రష్యా దురాక్రమణలో సుమారు 300 మంది పౌరులు మరణించినట్లు బుచా మేయర్‌ ఫెడోరుక్‌ ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో.. రష్యా బలగాలు తిరుగుముఖం పట్టిన టైంలో మరో 400 మందికి పైగా పొట్టనపెట్టుకుందని చెప్పారాయన. వీధుల వెంట బుల్లెట్‌ గాయాలతో, కాళ్లు చేతులు కట్టేసి ఉన్న శవాలే దర్శనమిస్తున్నాయి ఎటు చూసినా. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేషీలోని ఒలెక్‌సీ అరెస్టోవీచ్‌ బుచా ఊచకోతకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. 

Butcha లో మహిళలపై రష్యా బలగాలు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డాయని, ఆపై వాళ్లను కట్టేసి నిప్పటించి సజీవ దహనం చేశారని ఆరోపించారు. అంతేకాదు స్థానిక అధికారులు, పిల్లల మృతదేహాలు రోడ్ల వెంబడి చెల్లాచెదురుగా పడి ఉన్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

ఒకే చోట 300 మందికి నైరుతి భాగంలో ఉన్న ఓ చర్చి దగ్గర అంత్యక్రియలు నిర్వహించగా.. ఇది రష్యా జరిపిన ఉద్దేశపూర్వక మారణకాండగా ఉక్రెయిన్‌ రక్షణ శాఖ మంత్రి దిమిత్రి కులేబా అభివర్ణించారు. మృతుల్లో ఓ పసికందు, 14 ఏళ్ల బాలుడు కూడా ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇండిపెండెంట్‌ దర్యాప్తునకు ఆదేశించింది ఐక్యరాజ్య సమితి.

రష్యా కౌంటర్‌
ఈ ఆరోపణలపై రష్యా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. అదంతా కీవ్‌ నుంచి జరుగుతున్న కుట్రే అని పేర్కొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బుచాలో శవాల ఫొటోలు, వీడియోలు కీవ్‌ నుంచి వెలువడుతున్న రెచ్చగొట్టుడు సంకేతాలే అని పేర్కొంది. ఇదంతా కీవ్‌వర్గాలు ఆడుతున్న నాటకం. పాశ్చాత్య దేశాల మీడియా కోసమే ఇదంతా చూపిస్తున్నారు. రష్యా బలగాలు అక్కడ ఉన్న టైంలో ఒక్క సాధారణ పౌరుడు కూడా మరణించలేదు. ఎలాంటి హింసకు, అఘాయిత్యాలకు కూడా మా సైన్యం పాల్పడలేదు. శాంతి స్థాపనలో భాగంగానే మా దళాలు ఎలా వెళ్లాయో.. అలాగే వెనక్కి వచ్చేశాయి. అలాంటప్పుడు ఇదంతా ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించింది రష్యా రక్షణ శాఖ.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top