గాల్లోంచి.. మంచినీటి చుక్క, మాంసం ముక్క

Switzerland Scientists Developed Technology To Make Protein Food Water From Air - Sakshi

ఎక్కడో ఎడారి నడి మధ్యలో ఉన్నారు.. చెట్లూ చేమలు ఏమీ లేవు.. నీటి జాడ అసలే లేదు.. అయినా తినడానికి మాంచి మటన్‌ లాంటి ఫుడ్డు, కావల్సినన్ని నీళ్లు రెడీ. బయట ఎక్కడి నుంచో తేలేదు.. అక్కడే, ఆ ఎడారిలోనే అబ్రకదబ్ర అన్నట్టు గాలిలోంచి తయారైపోయాయ్‌. శాస్త్రవేత్తలు నిజంగానే గాల్లోంచి ప్రోటీన్‌ ఫుడ్‌ను, నీళ్లను తయారు చేసే టెక్నాలజీలను అభివృద్ధి చేశారు. ఆ విశేషాలివి..

నిరంతరాయంగా నీళ్లొస్తాయి 
ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల నీటికి కటకటే. ఎడారుల్లో మాత్రమే కాదు.. కొండలు, గుట్టల వంటిచోట కూడా తాగునీటికి తీవ్ర ఇబ్బందే. అలాంటి ప్రాంతాల్లో ఏమాత్రం ఖర్చు లేకుండా గాలి నుంచి నీటిని తీసే పరికరాన్ని స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్‌ జ్యూరిక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘సెల్ఫ్‌ కూలింగ్‌ కండెన్సేషన్‌ (తానంతట తానే చల్లబర్చుకుంటూ.. గాలిలోని నీటి ఆవిరిని సంగ్రహించే)’సాంకేతికతతో ఈ పరికరం పనిచేస్తుంది.

నిజానికి గాలిలోంచి నీటిని సంగ్రహించగల పరికరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. వాటికి విద్యుత్‌ అవసరం, ఉత్పత్తి అయ్యే నీళ్లు కూడా చాలా తక్కువ. కానీ తాము తయారు చేసిన పరికరానికి ఎలాంటి అదనపు ఖర్చు అవసరం లేదని.. పైగా రోజులో 24 గంటలూ నీటిని పొందవచ్చని ఈటీహెచ్‌ జ్యూరిక్‌ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 

ఎలా పనిచేస్తుంది? 
గాలిలోంచి నీటిని సంగ్రహించేందుకు ‘సెల్ఫ్‌ కూలింగ్‌ కండెన్సేషన్‌’చేయగల ప్రత్యేక గ్లాస్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. పాలిమర్, వెండి పొరలతో కూడిన ఈగ్లాస్‌ సూర్యరశ్మిని పూర్తిస్థాయిలో ప్రతిఫలింపజేస్తూ.. బాగా చల్లబడుతుంది. ఈ గ్లాస్‌ దిగువభాగాన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత కంటే.. ఏకంగా 15 డిగ్రీల సెంటీగ్రేడ్ల మేర తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది.

దీంతో గాలిలో ఉన్న నీటి ఆవిరి గ్లాస్‌ దిగువ భాగాన నీటి చుక్కలుగా పేరుకుంటూ..దిగువన ఉన్న కంటైనర్‌లో కి చేరుతుంది. ఈ విధానంలో పూర్తి స్వచ్ఛమైన నీరు వస్తుందని.. పది చదరపు మీటర్ల పరిమాణమున్న పరికరంతో రోజుకు 12.7 లీటర్ల నీళ్లు ఉత్పత్తి అవుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఇవాన్‌ హెక్లర్‌ తెలిపారు. 

మాంసమూ ఊడి పడుతుంది!
మటన్, చికెన్, ఫిష్‌.. ఇలా ఏ మాంసం ఏదైనా జనం లొట్టలేస్తూ లాగించేస్తుంటారు. మరోవైపు ఇది జీవ హింస అనే వాదనలు. ఈ మధ్య మొక్కల ఆధారిత (ప్లాంట్‌ బేస్డ్‌) మాంసం కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ ఇవేమీ లేకుండా నేరుగా గాలిలోంచే మాంసం తయారు చేయగలిగితే.. ఇంకా బెటర్‌ కదా. ఎయిర్‌ ప్రోటీన్‌ అనే సంస్థ దీనిని నిజం చేసింది. 

మొదట అంతరిక్ష యాత్ర కోసమని.. 
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు గాలిలోని వాయువులు, రసాయనాల నుంచి ప్రోటీన్లను ఉత్పత్తి చేయడంపై సుమారు 50 ఏళ్ల కిందే ప్రయోగాలు మొదలుపెట్టారు. అంగారకుడు, ఇతర గ్రహాలపై ఉన్న వాతావరణం నుంచి ప్రోటీన్లను ఉత్పత్తి చేయగలిగితే.. వ్యోమగాములకు ఆహారం సమస్య తీరుతుందనేది దీని ఉద్దేశం. ఈ పరిశోధనలను ఎయిర్‌ ప్రోటీన్‌ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు లీసా డైసన్, జాన్‌ రీడ్‌ తదితరులు స్ఫూర్తిగా తీసుకున్నారు.  

ఎయిర్‌ ప్రోటీన్‌ను తీసి.. 
వివిధ పద్ధతుల్లో గాలిలోని వాయువులు, మూలకాలను సేకరించి, అవసరమైన మేర సమ్మిళితం చేసి.. ‘ఎయిర్‌ ప్రోటీన్‌’ను రూపొందించారు. దానిని శుద్ధిచేసి, పూర్తిగా ఆరబెట్టి.. ఒక పిండి వంటి పదార్థంగా తయారు చేశారు. ఈ ‘ఎయిర్‌ ప్రోటీన్‌’పిండితో.. చికెన్, మటన్, ఫిష్‌ వంటి వివిధ రకాల మాంసం తరహాలో తయారు చేశారు.

తమ ‘ఎయిర్‌ ప్రొటీన్‌’రుచి, పోషకాల విషయంలో సాధారణ మాంసంతో సమానమని.. యాంటీ బయాటిక్స్, పురుగు మందుల అవశేషాలూ ఉండవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గాలిలోని కార్బన వాయువులను తగ్గించడం వల్ల పర్యావరణానికీ మేలు అని స్పష్టం చేస్తున్నారు.   
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top