21 మంది విద్యార్థులు మృతి.. నైట్‌ కబ్ల్‌లో ఏం జరిగింది?

School Students Dead In South Africa Bar - Sakshi

పరీక్షలు ముగిశాయని ఆనందంలో వారంతా పార్టీ చేసుకున్నారు. నైట్‌ క్లబ్‌లో ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు. ఇంతలో ఏమైందో తెలియదు.. నైట్‌ క్లబ్‌లో 21 మంది టీనేజర్లు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. 

వివరాల ప‍్రకారం.. పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులంతా కలిసి దక్షిణాఫ్రికాలోని టౌన్‌షిప్ టావెర్న్‌లో పార్టీ చేసుకున్నారు. అనంతరం వారంతా చనిపోవడం కలకలం రేపింది. అయితే, వారి బాడీలపై ఎలాంటి గాయాలు లేకపోవడం పలు అనుమానాలను తావిస్తోంది. దీంతో, పోలీసులు సైతం షాకయ్యారు. వీరి మృతి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలా ఉండగా.. విద్యార్థులు ఎలా మరణించారో తెలుసుకోవడానికి వారి మృతదేహాలను ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు. వారిపై ఏదైనా విషప్రయోగం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, స్థానిక వార్తాపత్రిక డిస్పాచ్‌లైవ్ తన వెబ్‌సైట్‌లో " మృతుల శరీరాలు టేబుల్స్‌, కుర్చీలు, నేలపై ఎక్కడపడితే అక్కడ పడి ఉన్నాయి, శరీరాలపై గాయాల ఆనవాళ్లు లేవు’’ అని కథనంలో పేర్కొంది. ఇక, చనిపోయిన వారిలో 8 మంది విద్యార్థినిలు ఉండగా.. 13 మంది బాలురు ఉన్నారు. 

మరోవైపు.. విద్యార్థుల మరణ వార్త తెలియడంలో వారి పేరెంట్స్‌ నైట్‌ క్లబ్‌ వద్దకు చేరుకున్నారు. తమ పిల్లలను చూపించాలని బోరున విలపించారు. అయితే, టౌన్‌షిప్ టావెర్న్‌లలో 18 ఏళ్లు పైబడిన వారికి మద్యపానం అనుమతిస్తారు. వీటిని సాధారణంగా షెబీన్స్ అని పిలుస్తారు. ఇవి ఇళ్లలో కూడా ఉంటాయి. ఇది అధికంగా సేవించడం వల్లే వారు చనిపోయి ఉంటారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కాగా, చాలా మంది విద్యార్థులు హైస్కూల్ పరీక్షలు ముగిసిన తర్వాత "పెన్సు డౌన్" పార్టీలు జరుపుకుంటున్నారని తల్లిదండ్రులు, అధికారులు చెప్పారు. 

విద్యార్థుల మరణ వార్తపై.. దక్షిణాఫ్రికా ప్రధాన మంత్రి ఆస్కార్ మబుయానే దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది జీర్ణించుకోలేని విషయం. 21 మంది యువత ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: జీ7 సదస్సు వేళ.. నామరూపాల్లేకుండా నగరాలు, పుతిన్‌ను హేళన చేస్తూ..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top