బుడాపెస్ట్: హంగేరీ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. 16 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన విక్టర్ ఓర్బన్ అధికార సామ్రాజ్యం బద్దలైంది. ‘తిస్జా’ (Tisza) పార్టీ వ్యవస్థాపకుడు 45 ఏళ్ల పీటర్ మాగ్యార్ హంగేరీ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వృత్తిరీత్యా లాయర్ అయిన మాగ్యార్, ఒకప్పుడు ఓర్బన్ రాజకీయ కోటరీలో అత్యంత కీలక వ్యక్తి. ఇప్పుడు ఆయనే ఆ కోటను బద్దలుకొట్టి, ఈ చారిత్రక విజయాన్ని నమోదు చేయడం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
పాలకునిగా కాదు.. సేవకుడిగానే ఉంటా
శనివారం హంగేరీ పార్లమెంట్‌లో నూతన ప్రధానిగా మాగ్యార్ ప్రమాణ స్వీకారం చేశారు. ‘లక్షలాది మంది హంగేరీ ప్రజలు మార్పును కోరుకున్నారు కాబట్టే నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. నేను ప్రజలను పాలించడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను’ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2024లో స్థాపించిన మధ్య-మితవాద ‘తిస్జా’ పార్టీ గత నెల ఎన్నికల్లో ఏకంగా 199 స్థానాలకు గాను 141 సీట్లు కైవసం చేసుకుని మూడింట రెండొంతుల మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఓర్బన్‌కు చెందిన ఫైడెజ్-కేడీఎన్‌పీ కూటమి కేవలం 52 స్థానాలకే పరిమితమైంది.
మారనున్న విదేశీ విధానం.. వేడుకకు ఓర్బన్ దూరం
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ప్రధాని విక్టర్ ఓర్బన్ హాజరుకాకపోవడం గమనార్హం. 1990 తర్వాత ఆయన ఒక పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండటం ఇదే తొలిసారి. కాగా మాగ్యార్ విజయంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో హంగేరీ సంబంధాలు మెరుగవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టబద్ధమైన పాలన, ఉక్రెయిన్‌కు మద్దతు వంటి అంశాల్లో ఈయూతో ఓర్బన్ సర్కార్‌కు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు స్పష్టమైన మెజారిటీ దక్కడంతో, పాత ప్రభుత్వ నిరంకుశ విధానాలను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు నూతన ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.
బుడాపెస్ట్‌లో సంబరాలు.. చట్టసభలో మహిళా శక్తి
నూతన ప్రధాని ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో రాజధాని బుడాపెస్ట్‌లోని కొసుత్ స్క్వేర్ వద్దకు వేలాది మంది మద్దతుదారులు చేరుకుని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ‘పాలనా మార్పు’గా మాగ్యార్ అభివర్ణించారు. మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే, ఈసారి హంగేరీ చట్టసభలో రికార్డు స్థాయిలో 54 మంది మహిళలు అడుగుపెట్టారు. దేశ శాసనసభ చరిత్రలో ఇదే అత్యధిక మహిళా ప్రాతినిధ్యం కాగా, వీరిలో అత్యధిక మంది మాగ్యార్‌కు చెందిన తిస్జా పార్టీ నుంచే ఎన్నికవడం విశేషం.
ఇది కూడా చదవండి: శోకసంద్రంలో కర్ణాటక.. మంత్రి సుధాకర్ కన్నుమూత


