LOFTID: ‘రక్షణ కవచం’ సక్సెస్‌.. గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి..

NASA completes LOFTID technology Designed To Land Humans on Mars - Sakshi

మానవ సహిత గ్రహాంతర ప్రయోగాల్లో వ్యోమనౌకలు సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ‘లోఫ్టిడ్‌ (లోఎర్త్‌ ఆర్బిట్‌ ఫ్లైట్‌ టెస్ట్‌ ఆఫ్‌ యాన్‌ ఇన్‌ఫ్లాటబుల్‌ డీసెలరేటర్‌)’ ప్రయోగం విజయవంతమైంది. అమెరికాలోని కాలిఫోరి్నయా నుంచి యునైటెడ్‌ లాంచ్‌ అలయన్స్‌కు చెందిన ‘అట్లాస్‌ వి’ రాకెట్‌ ద్వారా గురువారం తెల్లవారుజామున 4.49 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3.19 గంటలకు) ఓ వాతావరణ ఉపగ్రహంతో కలిపి లోఫ్టిడ్‌ను ప్రయోగించారు.


Photo credit: NASA

గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి. 
 అట్లాస్‌ వి రాకెట్‌ మొదట వాతావరణ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టి.. కాసేపటికి ‘లోఫ్టిడ్‌’ను భూమివైపు వదిలేసింది. వెంటనే ‘లోఫ్టిడ్‌’ తిరగేసిన గొడుగులా విచ్చుకుని.. గంటకు 20 వేలకుపైగా కిలోమీటర్ల వేగంతో భూమివైపు ప్రయాణం మొదలుపెట్టింది. వాతావరణ ఘర్షణతో దాని వేగం తగ్గుతూ వచ్చింది. భూఉపరితలానికి కొద్దివేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు అందు లోని పారాచూట్‌ విచ్చుకుని.. హవాయి లోని హొనొలులు దీవులకు తూర్పున పసి ఫిక్‌ మహా సముద్రంలో ల్యాండ్‌ అయింది.

భారత కాలమానం ప్రకారం.. గురు వారం సాయంత్రం 5.04 గంటలకు భూమివైపు ప్రయాణం ప్రారంభించిన హీట్‌ షీల్డ్‌.. 5.38 గంటలకు ల్యాండ్‌ అయింది. ఆ స్థలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ‘లోఫ్టిడ్‌’ను రికవరీ చేసేందుకు కహనా–2 అనే నౌకను పంపారు. ఈ నౌక ‘లోఫ్టిడ్‌’ను తీసుకుని తిరిగి కాలిఫోరి్నయా తీరానికి చేరేందుకు రెండు రోజులు పడుతుందని అంచనా. తర్వాత శాస్త్రవేత్తలు ‘లోఫ్టిడ్‌’లోని సెన్సర్లు రికార్డు చేసిన డేటాను అధ్యయనం చేసి.. ఎంత వేగంతో దిగింది? ఎంత ఉష్ణోగ్రత పుట్టింది? వాతావరణ పరిస్థితులను ఎంతమేర తట్టుకోగలిగిందన్న వివరాలను పరిశీలించనున్నారు. 

అంగారక వాతావరణానికి తగినట్టుగా మార్చేందుకు..
భూమితో పోలిస్తే అంగారకుడిపై వాతావరణం పలుచగా ఉంటుంది. అందువల్ల అక్కడి వాతావరణం ఘర్షణ కూడా తక్కువ. అందువల్ల వ్యోమనౌకలను ఏ వేగంతో, ఎలాంటి పరిస్థితుల్లో ల్యాండ్‌ చేయాలి, వేగం తగ్గించేందుకు ఏం చేయాలి, ‘లోఫ్టిడ్‌’లో అందుకు తగినట్టుగా ఎలాంటి మార్పు చేర్పులు అవసరమన్నది శాస్త్రవేత్తలు నిర్ధారించనున్నారు. ఈ మొత్తం డేటా ఆధారంగా ఇన్‌ఫ్లాటబుల్‌ హీట్‌ షీల్డ్‌కు తుదిరూపు ఇచ్చి భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించనున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top