Gaza: ఇజ్రాయెల్‌ నిప్పుల వాన, మరో 42 మంది మృతి

Israel air strikes kill 42 Palestinians, rockets fired from Gaza - Sakshi

వైమానిక దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం 

మరో 42 మంది మృతి.. 3 భవనాలు నేలమట్టం

యుద్ధం కొనసాగుతుందని నెతన్యాహు హెచ్చరిక

దుబాయ్‌: ఇజ్రాయెల్‌ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. గాజా సిటీపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఆదివారం నిప్పుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో మూడు భవనాలు నేలమట్టమయ్యాయి. కనీసం 42 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్‌ మిలటరీ మధ్య మొదలైన దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ ఆదివారం అతిపెద్ద దాడి చేసింది. ఏకంగా 42 ప్రాణాలను బలిగొంది. వీరిలో 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మరో 50 మంది గాయపడినట్లు వెల్లడించింది. గాజాలోని హమాస్‌ అగ్రనేత యాహియే సన్‌వార్‌ నివాసాన్ని తాము ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం స్పష్టం చేసింది. కాల్పుల విరమణ దిశగా ఇరు వర్గాలను ఒప్పించేందుకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నిస్తుండగా, ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య నాలుగో యుద్ధం తప్పదన్న సంకేతాలను  ఆదివారం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఇచ్చారు. హమాస్‌పై పూర్తిస్థాయిలో దాడులు కొనసాగుతాయన్నారు. హమాస్‌ భారీ మూల్యం చెల్లించాలని ఇజ్రాయెల్‌ కోరుకుంటోందన్నారు.   

ఇస్లామిక్‌ దేశాల అత్యవసర సమావేశం  
తాజా ఘర్షణలపై చర్చించేందుకు 57 ఇస్లామిక్‌ దేశాల కూటమి ఆదివారం అత్యవసరంగా సమావేశమయ్యింది. స్వతంత్ర దేశాన్ని కలిగి ఉండే అర్హత పాలస్తీనియన్లకు ఉందని ఇస్లామిక్‌ దేశాల కూటమి అభిప్రాయపడింది. జెరూసలేం, గాజాలో తాజా పరిస్థితికి ఇజ్రాయెల్‌ బాధ్యత వహించాలని కొన్ని ఇస్లామిక్‌ దేశాలు తేల్చిచెబుతున్నాయి.   
 

హింసను ఖండించిన పోప్‌ ఫ్రాన్సిస్‌  
ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్‌ నడుమ రగులుతున్న హింసాకాండను పోప్‌ ఫ్రాన్సిస్‌ తీవ్రంగా ఖండించారు. చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు భవిష్యత్తును నిర్మించాలని కోరుకోవడం లేదని, కేవలం నాశనం చేయాలని భావిస్తున్నారని ఆక్షేపించారు. ఇరు వర్గాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని సూచించారు.

యుద్ధ నేరమే: పాలస్తీనా
ఇజ్రాయెల్‌ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, గాజాలో మానవత్వంపై దాడి చేస్తోందని పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్‌ అల్‌–మాలికీ ఆరోపించారు. ‘పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న దారుణాలను వర్ణించడానికి పదాలు లేవు. కుటుంబాలను తుడిచిపెడుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులను బలి తీసుకుంటున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జెరూసలేం నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా వెళ్లగొట్టాలని ఇజ్రాయెల్‌ చూస్తోందన్నారు. ఇంకెంత మంది చనిపోతే మీరు ఈ దాడులను ఖండిస్తారని ఐరాస భద్రతా మండలిని నిలదీశారు.

సంయమనం పాటించాలి: భారత్‌
మరోవైపు ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, దాడులకు పాల్పడవద్దని భారత్‌ విజ్ఞప్తి చేసింది. ఉద్రిక్తతలు తగ్గడమే తక్షణావసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌.త్రిమూర్తి అన్నారు. పాలస్తీనాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. గాజాలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గ్యుటెరస్‌ అన్నారు. వెంటనే దాడులు ఆగాలన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top