‘హిజాబ్‌’ హీట్‌: హిజాబ్‌లు తొలగించి.. జుట్టు కత్తిరించుకుని ఇరాన్‌ మహిళల నిరసన

Iran Women Burn Hijabs Cut Hair Amid Mahsa Amini Death - Sakshi

అన్యాయంగా ఓ యువతిని పొట్టనబెట్టుకున్న మోరల్‌ పోలీసింగ్‌పై.. అక్కడి మహిళా లోకం ఎదురు తిరిగింది. ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ప్రదర్శనలు మిన్నంటాయి. 22 ఏళ్ల మహ్‌సా అమినీ పోలీసుల వేధింపుల వల్లే మరణించిందనే నేపథ్యంతో.. మహిళలు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులను తీవ్రంగా అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం యత్నిస్తుండగా.. సోషల్‌ మీడియా వేదికగా తమ నిరసనలను కొనసాగిస్తున్నారు పలువురు.   

ఇరాన్‌ మహిళలు చాలామం‍ది బహిరంగంగానే హిజాబ్‌లు తొలగించి.. వాటిని తగలబెడుతున్నారు. మరికొందరు జుట్టును కత్తిరించుకుని.. వాటిని వీడియోలుగా తీసి వైరల్‌ చేస్తున్నారు. దమ్ముంటే ఏం చేస్తారో చేసుకోండంటూ ఇరాన్‌ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిండిన వీడియోలే ఇప్పుడు అక్కడ సోషల్‌ మీడియాలో పోటెత్తుతున్నాయి. మరోపక్క​ రోడ్డెక్కిన వేలమంది మహిళలను అణిచివేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టియర్‌ గ్యాస్‌, తుపాకులు ప్రయోగించి చెల్లాచెదురు చేస్తున్న దృశ్యాలు ట్విటర్‌లో కనిపిస్తున్నాయి. 

ఇరాన్‌లో ఏడేళ్లు దాటిన మహిళంతా హిజాబ్‌ ధరించాలనే కఠిన మత నిబంధన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టును కవర్‌ చేసుకోవడంతో పాటు నిండుగా ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే.. బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్‌ కూడా చేస్తారు. దీనిపై చాలాకాలంగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ.. సవరించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధంగా లేదు.

తాజాగా తన కుటుంబంతో ఆ దేశ రాజధాని టెహ్రాన్‌కు వెళ్లిన మహ్‌సా అమినీ.. ఆమె కుటుంబీలకు సమక్షంలోనే అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆపై హఠాత్తుగా ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. కోమాలో నుంచే కన్నుమూసిందామె. ఈ ఘటనపై ఇరాన్‌ మహిళా లోకం భగ్గుమంది. ఆమెపై ఒంటిపై గాయాలున్నాయని ఆమెది ముమ్మాటికీ వేధింపుల హత్యే అని అమినీ కుటుంబంతో సహా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన దేశాన్ని కుదిపేస్తుండడంతో.. అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించింది అక్కడి ప్రభుత్వం.

ఇదీ చదవండి: వాళ్లను తాకొద్దు.. మంకీపాక్స్‌ వస్తది!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top