రంగంలోకి హూతీలు! | Iran Launches Fresh Strikes In Gulf | Sakshi
Sakshi News home page

రంగంలోకి హూతీలు!

Mar 29 2026 5:15 AM | Updated on Mar 29 2026 5:15 AM

Iran Launches Fresh Strikes In Gulf

ఇరాన్‌ క్షిపణి దాడిలో సెంట్రల్‌ ఇజ్రాయెల్‌లోని ఎష్టోల్‌లో ధ్వంసమైన భవంతి వద్ద రెస్క్యూ సిబ్బంది

పశ్చిమాసియాలో విస్తరిస్తున్న యుద్ధం 

ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు

సౌదీ వైమానిక స్థావరంపైకి 6 క్షిపణులు, 29 డ్రోన్లు 

15 మంది అమెరికా సైనికులకు గాయాలు 

3 అమెరికా యుద్ధ విమానాలకు నష్టం 

ఉక్రెయిన్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్‌ ధ్వంసం! 

ఒమన్‌ సమీపంలో అమెరికా నౌకపై దాడి 

గల్ఫ్‌కు 3,500 మంది అమెరికా సైనికులు 

సంక్షోభంపై నేడు గల్ఫ్‌ దేశాల మంతనాలు

దుబాయ్‌: పశ్చిమాసియాలో కల్లోలం నానాటికీ విస్తరిస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు తెర తీసి నెల రోజులైనా ఉద్రిక్తతలు చల్లారకపోగా నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. ఇరాన్‌కు దన్నుగా యెమన్‌కు చెందిన హూతీలు కూడా యుద్ధరంగంలోకి అడుగు పెట్టారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని కీలక సైనిక స్థావరాలపై శనివారం పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు దిగినట్టు ప్రకటించారు. వారికి మద్దతుగా హెజ్బొల్లా ఉగ్ర సంస్థ కూడా ఇజ్రాయెల్‌పై ఎడాపెడా క్షిపణులు ప్రయోగించింది. దాంతో పరిస్థితి మరింతగా విషమించేలా కన్పిస్తోంది. ఎర్రసముద్రంలో ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్ల మేరకు వాణిజ్యం జరిగే కీలకమైన బాబ్‌ ఎల్‌మందెబ్‌ జలసంధిని కూడా హూతీలు మూసేసే సూచనలు కన్పిస్తున్నాయి.

అదే జరిగితే అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా ఇంధన సరఫరా మరింతగా కుదేలవడం ఖాయమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలపై దాడులను తీవ్రస్థాయిలో కొనసాగించింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ వైమానిక స్థావరంపైకి ఏకంగా 6 బాలిస్టిక్‌ క్షిపణులు, 29 డ్రోన్లు ప్రయోగించింది. దాంతో కనీసం 15 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండు వారాల్లో గాయపడ్డ అమెరికా సైనికుల సంఖ్య 25 దాటింది. మొత్తమ్మీద ఈ యుద్ధంలో క్షతగాత్రులైన వారి సంఖ్య 300 దాటింది. మూడు రీ ఫ్యూయలింగ్‌ విమానాలతో పాటు అమెరికాకు చెందిన పలు యుద్ద విమానాలు కూడా దాడుల్లో దెబ్బతిన్నట్టు స్థానిక అధికార వర్గాలు తెలిపాయి.

దుబాయ్‌లో ఉక్రెయిన్‌ నుంచి దిగుమతి చేసుకున్న యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్‌ నిల్వ కేంద్రంపైనా దాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్టు ఇరాన్‌ ప్రకటించింది. ఆ సమయంలో అందులో 20 మంది దాకా ఉక్రేనియన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఒమన్‌ సమీపంలో ఒక అమెరికా నౌకపై కూడా దాడి చేసినట్టు ఇరాన్‌ వెల్లడించింది. అమెరికా సైనికులు తలదాచుకున్నారన్న సమాచారంతో దుబాయ్‌లో ఒక హోటల్‌పై కామికాజ్‌ క్షిపణితో దాడి చేసినట్టు రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించారు. కువైట్‌పై దాడుల్లో పలు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నాయి.

దక్షిణ లెబనాన్‌లో యుద్ధాన్ని కవర్‌ చేస్తున్న ముగ్గురు జర్నలిస్టులు ఇజ్రాయెల్‌ దాడులకు బలయ్యారు! యూఏఈలోని ఖలీఫా ఎకనామిక్‌ జోన్‌పై ఇరాన్‌ క్షిపణి దాడిలో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. ఇరాన్‌ దాడులతో ఇజ్రాయెల్‌ కూడా అల్లాడిపోయింది. జెరూసలేం, టెల్‌ అవీవ్, బీర్‌ షెబాతో పాటు పలు నగరాల్లో నిర్విరామంగా సైరన్లు మోగాయి. సెంట్రల్‌ ఇజ్రాయెల్‌లోని ఎషో్టల్‌లో కనీసం 11 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 3,500 మంది అమెరికా సైనికులు గల్ఫ్‌కు చేరుకున్నట్టు సమాచారం! 

దద్దరిల్లిన టెహ్రాన్‌ 
ఇరాన్‌ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడులు శనివారం కూడా కొనసాగాయి. రాజధాని టెహ్రాన్‌ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. పలు ప్రాంతాల్లో మంటలు, పొగ కనిపించాయి. మీనాబ్‌ నగరంలో ఒక క్లినిక్‌పై అమెరికా సైన్యం పెద్ద ఎత్తున దాడి చేసింది. అయితే ప్రాణనష్టమేమీ సంభవించలేదని స మాచారం. తమ దేశంలో మృతుల సంఖ్య 1,900 దాటినట్టు ఇరాన్‌ పేర్కొంది. లెబనాన్‌లో 1,100కు పైగా, ఇజ్రాయెల్‌లో 19 మంది, గల్ఫ్‌ దేశాల్లో 20 మంది మరణించారు. లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా క్షిపణి దాడుల్లో కనీసం 9 మంది సైనికులు గాయపడ్డట్టు ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది.  

గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ వారి్నంగ్‌ 
యుద్ధం ఆగి శాంతి నెలకొనాలంటే గల్ఫ్‌ దేశాలు తాము చెప్పినట్టు వినాల్సిందేనని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కుండబద్దలు కొట్టారు. ఇరాన్‌పై దాడులకు వారి గగనతలాలను వాడుకునేందుకు అమెరికాను అనుమతించరాదన్నారు. శత్రువుకు సహకరించేవారిని వదలబోమని పునరుద్ఘాటించారు. భూతల దాడులకు అమెరికా 10 వేల సైన్యాన్ని పంపుతోందన్న వార్తలపై ఇరాన్‌ మీడియా వ్యంగ్యంగా స్పందించింది. ‘నరకానికి స్వాగతం’ అనే శీర్షికలతో దీనిపై వార్తలు ప్రచురించింది. ఇరాన్‌ గడ్డపై అడుగు పెట్టే ప్రతి అమెరికా సైనికుడూ శవపేటికలోకి చేరడం ఖాయమని హెచ్చరించింది. మరోవైపు ఇంధన సంక్షోభం ఇరాన్‌కు వరంగా మారుతోంది. చమురు ఎగుమతుల ద్వారా ఆ దేశం రోజుకు ఏకంగా రూ.1,319 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నట్టు సమాచారం.  

అమెరికా, ఇరాన్‌ చర్చల్లో ప్రతిష్టంభన
ఇరాన్‌తో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినా పరిస్థితిలో మాత్రం పెద్దగా పురోగతి కన్పించడం లేదు. చర్చల విషయంలో అమెరికా చిత్తశుద్ధిపై తమకు నమ్మకం లేదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ శనివారం కుండబద్దలు కొట్టారు! ఈ నేపథ్యంలో యుద్ధానికి తెర దించే మార్గాలను అన్వేషించేందుకు పలు గల్ఫ్‌ దేశాల నడుమ ఆదివారం కీలక సమావేశం జరగనుంది.

ఇందుకు పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదిక కానుంది. మరోవైపు ఐరాస విజ్ఞప్తి మేరకు హార్మూజ్‌ గుండా మానవీయ సాయం, వ్యవసాయోత్పత్తులతో కూడిన నౌకలను అనుమతించేందుకు ఇరాన్‌ అంగీకరించింది. హార్మూజ్‌ను తెరిచేందుకు ఆ దేశానికి విధించిన డెడ్‌లైన్‌ను ఏప్రిల్‌ 6 దాకా ట్రంప్‌ పొడిగించడం తెలిసిందే. ఇరాన్‌పై దాడి ద్వారా తాము ఆశించిన లక్ష్యాలను భూతల దాడులతో నిమిత్తం లేకుండానే సాధిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధీమా వెలిబుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement