గ్రీన్‌ల్యాండ్‌ కరుగుతోంది! 

Greenland Ice Melting Faster Than At Any Time - Sakshi

పెరుగుతున్న సముద్రమట్టాలతో భయాందోళనలు 

గ్రీన్‌ల్యాండ్‌లో మంచు అనుకున్న దానికంటే వేగంగా కరిగిపోతోంది. దీంతో సముద్రమట్టాలు పెరిగిపోతూ భయాందోళనలు రేపుతున్నాయి. గత రెండు దశాబ్దాల్లో 4,700 గిగాటన్నుల (4,70 లక్షల కోట్ల టన్నులు) హిమం కరిగిపోయిందంటే ఏ స్థాయిలో కరిగిందో అంచనావేయొచ్చు. కరిగిన నీళ్లన్నీ  అమెరికాలో చేరితే ఆ దేశం 1.5 అడుగుల మేర మునిగిపోతుందని ఇటీవలి ఓ అధ్యయనంలో పరిశోధకులు చెప్పారు. ఆ అధ్యయనం విశేషాలు తెలుసుకుందామా..! 

2002 నుంచి గ్రీన్‌లాండ్‌లో కరిగిన మంచు వల్ల సముద్ర మట్టాలు 1.2 సెంటీమీటర్ల మేర పెరిగినట్లు గుర్తించారు. ఏప్రిల్‌ 2002–ఆగస్టు 2021 మధ్య కాలంలో గ్రేవిటీ రికవరీ క్లైమెట్‌ ఎక్స్‌పరిమెంట్‌ (గ్రేస్‌) ఉపగ్రహాల నుంచి సేకరించిన వివరాలతో డెన్మార్స్‌ పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. మంచు ఫలకాల అంచుల్లో ఎక్కువ కరిగినట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది.

అయితే ఫలకల మధ్యప్రాంతంలో మంచు పరిమాణం ఒకింత పెరిగిందని, ఇది పెరగడానికి కారణం హిమపాతమని పరిశోధకులు చెప్పారు. ముఖ్యంగా ఉపరితల జలాలు పెద్దమొత్తంలో వేడెక్కుతున్న పశ్చిమ గ్రీన్‌లాండ్‌ తీరంలో ఎక్కువ మంచు కరిగింది. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలో పెద్దమొత్తంలో మంచు కరిగిపోవడం వల్ల సముద్రమట్టాలు పెరుగుతున్నాయని నాసా చెప్పింది.  

అంటార్కిటికాలో కరిగితే..  
అంటార్కిటికాలోని మంచు ఫలకాలన్నీ కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు 60 మీటర్లు పెరుగుతాయని అమెరికాకు చెందిన జాతీయ మంచు సమాచార కేంద్రం వెల్లడించింది. అదే గ్రీన్‌లాండ్‌లోని ఫలకాలన్నీ కరిగితే సముద్రమట్టాలు 7.4 మీటర్ల మేర పెరుగుతాయని పేర్కొంది. 2019లో నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం భూతాపస్థాయి ఇప్పుడున్న ప్రకారమే ఉంటే గ్రీన్‌లాండ్‌ వల్ల ఈ శతాబ్దం చివరినాటికి సముద్రమట్టాలు 7–13 సెం.మీ. పెరుగుతాయని అంచనా. సముద్రమట్టం ఒక్క సెం.మీ పెరిగితే దానివల్ల 60లక్షల మంది వరదముంపు బారిన పడతారని నాసాకు చెందిన ఆండ్రూ షెఫర్డ్‌ పేర్కొన్నారు.  

2300 నాటికి 4 అడుగులు... 
♦2015 ప్యారిస్‌ వాతావరణ ఒప్పందం ప్రకారం అన్ని దేశాలు నడుచుకున్నా 2300 సంవత్సరం నాటికి సముద్రమట్టాలు 4 అడుగులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 
♦సముద్రమట్టాల పెంపుతో షాంఘై నుంచి లండన్‌ దాకా ఉన్న నగరాలతోపాటు సముద్రమట్టానికి దిగువన లేదా సమీపంలో ఉన్న ఫ్లోరిడా లేదా బంగ్లాదేశ్‌లకు ముప్పు ఎక్కువగా ఉంటుంది.  
♦ఈ ముప్పు తప్పించాలంటే మనం కర్భన ఉద్గారాలను వీలైనంత త్వరగా నియంత్రించాల్సిన అవసరం ఉందని జర్మనీ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. 
♦ఈ శతాబ్దం రెండో సగానికి వచ్చే నాటికల్లా కర్భన ఉద్గారాలను జీరోస్థాయికి తీసుకురావాలని పర్యావరణ ఒప్పందాలు ఇప్పటికే లక్ష్యం విధించాయి. 
♦పరిశ్రమల నుంచి పెద్దమొత్తంలో విడుదలయ్యే వాయు కాలుష్యం వల్ల మహాసముద్రాల మట్టాలు విపరీతంగా పెరిగిపోతాయి. 
♦పర్యావరణ ఒప్పందాల అమలు జాప్యం పెరిగేకొద్దీ కర్భన ఉద్గారాలు మరింతగా పెరిగి 2300 నాటికి సుమద్రమట్టాలు అదనంగా 20 సెం.మీ. మేర పెరుగుతాయి. 
–సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top