
గ్రీన్‌లాండ్‌పై పట్టుకు అమెరికా యత్నం
సైనిక స్థావరాలను బలోపేతం చేస్తున్న రష్యా
మైనింగ్ మాటున ఆర్కిటిక్‌లో చైనా గూఢచర్యం
పర్యావరణానికి ముప్పుగా వాతావరణ మార్పులు
భూమి ఎగువ భాగమైన ఉత్తర ధ్రువంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అర్కిటిక్‌పై నియంత్రణ కోసం గ్రీన్‌లాండ్‌ను స్వా«దీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయతి్నస్తున్నారు. మరోవైపు రష్యా ఆర్కిటిక్‌లోని తన సైనిక స్థావరాలను ఆధునీకరిస్తోంది. ఇంకోవైపు చైనా ఐస్ బ్రేకర్లు అక్కడ సరికొత్త మార్గాలు తెరుస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతమైన అర్కిటిక్ కోసం పెద్ద దేశాల మధ్య ముదురుతున్న ఈపోటీ ప్రపంచ భద్రతకే పెను ముప్పుగా మారుతోంది.
ఆర్కిటిక్‌పై పట్టు కోసం అగ్రరాజ్యాల మధ్య ఈ పోటీ ఎందుకో అర్థం కావాలంటే ఆ ప్రాంతాన్ని భూగోళం పై నుంచి చూసి అర్థం చేసుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభంలో గ్రీన్‌ల్యాండ్æకు ఉత్తరాన ఉన్న మారుమూల ప్రాంతంలో థూలే అనే ప్రదేశంలో అమెరికా ఒక ముఖ్యమైన స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా ఆ ప్రదేశ ప్రాముఖ్యత తగ్గలేదు. గ్రీన్‌లాండ్ ఇప్పటికీ డెన్మార్క్‌లో భాగంగా అ«దీనంలోనే ఉంది. దాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని అమెరికా ఎప్పటినుంచో యోచిస్తోంది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఈ ప్రయత్నాలు మరింత వేగవంతం చేశారు.
అమెరికా రక్షణకోసం గోల్డెన్ డోమ్ వ్యవస్థను ఇటీవలే అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. ఇలాంటి వ్యవస్థకు ముందస్తు హెచ్చరిక సైట్లు చాలా ముఖ్యమైనవి. అలా రక్షణ, దాడి రెండింటికీ పనిచేసే స్థావరంగా గ్రీన్‌లాండ్‌ను అమెరికా చూస్తోంది. ఇది చాలాకాలంగా రష్యాకు ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఏదైనా ముందడుగు వేస్తే అత్యంత ప్రభావితమయ్యేది రష్యానే. రష్యా భూభాగంలో ఐదో వంతు ఆర్కిటిక్‌లో ఉంది. ఇక ఆ దేశ తీరప్రాంతంలో సగానికి పైగా ఆర్కిటిక్ వెంబడే ఉంది. అందుకే అర్కిటిక్‌లో రష్యా కొన్నేళ్లుగా ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెడుతోంది.
నాగూర్‌స్కోయ్ వంటి ౖతన వైమానిక స్థావరాలను యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచే నిర్వహిస్తున్న ఆ స్థావరాలను భారీ విమానాలను కూడా ఆపరేట్ చేయగలిగేలా తీర్చిదిద్దుతోంది. రష్యా అణు జలాంతర్గామి దళంలో ఎక్కువ భాగం కోలా ద్వీపకల్పంలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యరి్థపై దాడికి వీలుగా వాటిని ఆర్కిటిక్‌లో మంచు కింద నిలిపి ఉంచుతుంది.
ఇటు అమెరికా, అటు రష్యా చేస్తున్న ఈ ప్రయత్నాలు నాటో కూటమిలోని యూరప్ దేశాలను భయపెడుతున్నాయి. దాంతో ఈ ఉద్రిక్తతలను తగ్గించడంపై నార్వే దృష్టి పెటింది. ఆర్కిటిక్‌లో మరో కీలక ప్రాంతం స్వాల్బార్డ్ దీవులు. వాటిని నార్వే నియంత్రిస్తుంది. అయినా రష్యాతో సహా అనేక దేశాలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్ మధ్య ఖాళీ ప్రదేశం కూడా కీలకమే. అట్లాంటిక్‌ను చేరుకోవడానికి రష్యన్ ఉత్తరాది నౌకాదళం ఈ జలాలను దాటాల్సి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ యు–బోట్లను ఎదుర్కోవడానికి గ్రీన్‌లాండ్‌లో అమెరికా సైనిక స్థావరాన్ని స్థాపించడానికి ఈ జల సంధే కారణం.
రేసులోకి బ్రిటన్
ఇటీవలి కాలంలో బ్రిటన్ కూడా ఆర్కిటిక్‌పై దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ మే చివరలో ఆర్కిటిక్‌ను సందర్శించారు. అక్కడ శత్రు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి ఐస్‌లాండ్‌తో కలిసి ఉమ్మడి పథకాన్ని ప్రకటించారు. రష్యన్ జలాంతర్గాములు, పడవలను ఆచూకీ కనిపెట్టడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. కానీ జలాంతర్గాములు, సముద్ర గస్తీ, వైమానిక ముందస్తు హెచ్చరిక విమానాలు బ్రిటన్ లేని నేపథ్యంలో ఈ యత్నాలేవీ ఫలించేలా లేవు.
ఇక ఆర్కిటిక్‌కు చాలా దూరంలో ఉన్న చైనా, తనను తాను ఆ ప్రాంతానికి అతి సమీప దేశంగా చెప్పుకుంటోంది. ఇటీవలి కాలంలో అక్కడ దూకుడు పెంచింది. అక్కడ మంచు విపరీతంగా కరగడం వల్ల ఉత్తరాది అంతటా కొత్త వాణిజ్య మార్గం ఏర్పడుతుండటం చైనాకు బాగా కలిసొస్తోంది. సూయజ్ కాల్వతో పోలిస్తే ఈ మార్గం దానికి బాగా అనుకూలం. అక్కడ విద్యుత్తు ప్రొజెక్ట్ ఏర్పాటుకూ చైనా ప్రయతి్నస్తోంది. అక్కడ ఐస్‌బ్రేకర్ల సముదాయాన్ని వేగంగా విస్తరిస్తోంది. మైనింగ్ సంస్థలు, విద్యా పరిశోధనల మాటున ఆర్కిటిక్‌లో చైనా గూఢచారులు బిజీగా గడుపుతున్నారు. ఇవన్నీ అమెరికా, రష్యాల్లో ఆందోళన పెంచుతున్నాయి.
డేంజర్ బెల్స్
ఇలా ఆర్కిటిక్‌పై పట్టు కోసం ఏ దేశానికి ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు ఆక్కడ విపరీతమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. 2040 నాటికి వేసవిలో ఈ ప్రాంతంలో మంచు ఆనవాలే ఉండకపోవచ్చని ఒక అధ్యయనం ఇప్పటికే హెచ్చరించింది. ఇలా మంచు కరగడం వల్ల్ల ఖనిజాలు, చేపలు, ఇతర సముద్ర సంపద కోసం పోటీ పెరుగుతుంది. మరోవైపు షిప్పింగ్‌కు దారులు పెరుగుతాయి. ఈ ఆర్థిక పోటీ పెద్ద దేశాల మధ్య మరిన్ని తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయవచ్చు. రష్యా ఆర్థిక ఉత్పత్తిలో దాదాపు పదోవంతు ఆర్కిటిక్ సహజ వనరుల నుంచే వస్తుంది. అక్కడ మంచు విపరీతంగా కరుగుతుండటం రష్యా భద్రతను డోలాయమానంలో పడేస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్