Nayera Ashraf Murder Case: అంత ఘోరంగా చంపాడు.. వాడి ఉరి దేశమంతా చూడాలి

Egypt Gilted lover who Kill Nayera Ashraf Executed On Live TV - Sakshi

ప్రేమ, పెళ్లికి నిరాకరించడంతో ప్రేమోన్మాదులు.. పాశవికంగా దాడులకు పాల్పడుతున్నట్లు ఘటనలు చూస్తుంటాం. కానీ, చట్ట ప్రకారం కఠిన శిక్షలు లేకపోవడం, ఇలాంటివి పెరిగిపోవడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. యువతుల జీవితాలను చిదిమేయాలని ప్రయత్నించే వాళ్లకు గుణపాఠం చెప్పాలని, భావితరాలకు గట్టి సందేశం ఇవ్వాలని ఈజిప్ట్‌ కోర్టు ఒకటి నిర్ణయించుకుంది.  

ఉత్తర ఈజిప్ట్‌లోని మాన్‌సోరా యూనివర్సిటీలో చదువుతున్న మోహమద్‌ అడెల్‌.. తనతో పాటు చదువుకునే నయెరా అష్రాఫ్‌ను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించాడనే కోపంలోనే అతను ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. జూన్‌ నెలలోనే ఈ ఘటన జరగ్గా.  జూన్‌ 28వ తేదీన అతనికి మరణశిక్ష విధించింది మాన్‌సోరా కోర్టు. అయితే.. అతని మరణ శిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఈజిప్ట్‌ పార్లమెంట్‌కు ఓ లేఖ కూడా రాసింది. 

పూర్తిగా ఉరి తీయడం వీలు లేకున్నా.. కనీసం అతని ఉరి ఏర్పాట్లనైనా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆ లేఖలో కోర్టు పేర్కొంది. ఆ దుర్మార్గుడు ఆమెను అతికిరాతకంగా చంపాడు. అందుకే దేశం మొత్తం అతని శిక్షను చూడాలి. ఈ శిక్ష ద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడాలనుకునేవాళ్లు వణికిపోవాలి. దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే.. చట్టసభ అందుకు అనుమతించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.  తీర్పు కిందటి నెలనే ఇచ్చినప్పటికీ.. జులై 24న తీర్పు కాపీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ నిర్ణయం ఈజిప్ట్‌ గ్రాండ్‌ ముఫ్తీ డాక్టర్‌ షాకీ అలం చేతిలో ఉంది. 

అయితే న్యాయపరంగా పోరాడేందుకు అడెల్‌కు ఇంకా అవకాశం ఉంది. రెండు నెలల పాటు క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు హక్కు ఉందని అతని తరపు న్యాయవాది చెప్తున్నారు. ఇప్పటికే శిక్ష విధించి నెలరోజులు పూర్తైంది. ఇంకా నెలరోజులే మిగిలి ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నయెరా అష్రాఫ్‌ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమెను ఘోరాతి ఘోరంగా చంపిన వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

గతంలో.. ఇలాగే ఓ శిక్షను ప్రజలు చూసేలా ప్రసారం చేశారు అక్క్డడి అధికారులు. 1998లో రాజధాని కైరోలో ఓ మహిళను, ఆమె ఇద్దరు పిల్లలను దారుణంగా చంపిన ముగ్గురు నిందితులను.. ఉరి తీసే కార్యక్రమాన్ని లైవ్‌ టెలికాస్ట్ చేశారు అక్కడి టీవీ ఛానెళ్లలో. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top