Chandrababu Singapore Partner Iswaran CPIB Case: HPL Billionaire Ong Beng Seng Has Been Arrested, Know Details - Sakshi
Sakshi News home page

Singapore : చంద్రబాబు ఫ్రెండ్‌ ఈశ్వరన్ అరెస్ట్‌

Published Fri, Jul 14 2023 11:44 AM

Chandrababu Singapore Partner Iswaran Case Ong Beng Seng Issued Notice CPIB - Sakshi

సింగపూర్ : చంద్రబాబు ఆప్త మిత్రుడు, సింగపూర్‌ రవాణాశాఖ మంత్రిగా మొన్నటి వరకు పని చేసిన ఎస్‌.ఈశ్వరన్‌ అరెస్ట్‌ అయ్యారు. ప్రధాని ఆదేశాలతో ఇటీవలే పదవి నుంచి తప్పుకున్న ఈశ్వరన్‌ను జూలై 11నే అరెస్ట్‌ చేయగా.. బెయిల్‌పై విడుదల అయినట్లు అక్కడి అత్యున్నత దర్యాప్తు సంస్థ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (సీపీఐబీ) శుక్రవారం వెల్లడించింది.

అయితే ఈశ్వరన్‌పై విచారణ ప్రారంభించిన మరుసటి రోజే CPIB  ఆయన సన్నిహితులపై కూడా దృష్టి సారించింది. మంత్రి ఈశ్వరన్‌ కొన్ని అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఆధారాలు సేకరించి.. దీనికి సంబంధించి ఈశ్వరన్ అత్యంత సన్నిహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త హూంగ్‌ బెంగ్ సెంగ్‌ ను అరెస్ట్ చేసింది. 


(ఈశ్వరన్ సన్నిహితుడు సెంగ్ ను అరెస్ట్ చేస్తోన్న సింగపూర్ పోలీసులు)

ఎవరీ హూంగ్ బెంగ్ సెంగ్ ? 

హూంగ్‌ బెంగ్ సెంగ్‌ ఒక హోటల్ అధినేత. ఆయన సంస్థ పేరు హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్(HPL). దీని వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్‌ కూడా హూంగ్‌ బెంగ్ సెంగ్‌. 2008లో ఫార్ములా వన్ రేస్‌ను సింగపూర్‌కు తీసుకువస్తానంటూ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసి కాంట్రాక్టు సంపాదించారు సెంగ్. ఈ కాంట్రాక్టు మొత్తం విలువ 135 మిలియన్ డాలర్లు.


(F1 ప్రతినిధులతో ఈశ్వరన్)

ఈశ్వరన్ పాత్ర ఏంటీ?

ఫార్ములా వన్ రేస్‌ ప్రాజెక్టుకు సంబంధించి హూంగ్‌ బెంగ్ సెంగ్‌ సింగపూర్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి ఈశ్వరన్ ఈ వ్యవహారం నడిపించారు. మొత్తం 135 మిలియన్ డాలర్ల ఈ కాంట్రాక్టులో 40 శాతం వాటా ప్రమోటర్ గా హూంగ్‌ బెంగ్ సెంగ్‌ ది. ఆ మేరకు నిధులను సమకూరుస్తాడు. ఇక ఈ కాంట్రాక్టులో 60 శాతం నిధులను  సింగపూర్ టూరిజం బోర్డు ఇవ్వాలి. ఈ మేరకు మంత్రిగా ఈశ్వరన్ ఈ ఒప్పందంలో ప్రభుత్వం తరపున సంతకాలు చేశారు.


(తన స్నేహితుడు సెంగ్ తో ఈశ్వరన్ సెల్ఫీ)

దర్యాప్తు సంస్థ అభియోగాలేంటీ?

ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న CPIB సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. అయితే ప్రభుత్వం కేటాయించిన 60 శాతం నిధులలో కుంభకోణం జరిగిందని గుర్తించింది. ఈ వ్యవహారంలో హూంగ్‌ బెంగ్ సెంగ్‌ పారదర్శకత పాటించకపోవడం, కొన్నిపెద్ద మొత్తాలకు సంబంధించిన వ్యవహారాన్ని గుప్తంగా ఉంచడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో హూంగ్‌ బెంగ్ సెంగ్‌ కు మొదటి నుంచి మద్దతిస్తోన్న మంత్రి ఈశ్వరన్ పైనా ప్రధానికి లేఖ రాసింది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ CPIB నుంచి లేఖ రావడంతో హుటాహుటిన ఈశ్వరన్ ను బాధ్యతల నుంచి తప్పించారు ప్రధాని. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ప్రధాని.


( సింగపూర్ ప్రధాని విడుదల చేసిన ప్రకటన)

శ్వరన్ వ్యవహారశైలి ఏంటీ?

మొదటి నుంచి ఈశ్వరన్ వ్యవహారశైలి అనుమానస్పదంగానే ఉందన్నది సింగపూర్ వర్గాల సమాచారం. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రాజెక్టుల్లో తలదూర్చడం, భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని మభ్యపెట్టడం, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తారన్న ఆరోపణలున్నాయి. 

చంద్రబాబుకు, సింగపూర్ కు లింకేంటీ?

చంద్రబాబు తన ప్రసంగాల్లో ఎక్కువ సార్లు పలికే దేశం పేరు సింగపూర్. సింగపూర్ లో చంద్రబాబుకు ఓ భారీ హోటల్ ఉందని తెలుగుదేశం వర్గాల్లోనే ప్రచారం ఉంది. సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులతో పరిచయాలు పెంచుకోవడం, అక్కడి వ్యవహారాల్లో తల దూర్చడం బాబుకు బాగా అలవాటని చెబుతారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. కొత్త రాజధాని కోసం కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అసలే వద్దని సూచించింది. అయినా చంద్రబాబు అమరావతిలోనే రాజధాని అని ప్రకటించాడు. ఆ వెంటనే లాండ్ పూలింగ్ అంటూ రైతుల నుంచి భూమి సేకరించాడు. 


(నారా లోకేష్ తో  సింగపూర్ ఈశ్వరన్)

అమరావతి రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్‌ సంస్థలను తెరమీదకు తెచ్చారు. అసెండాస్‌–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్‌ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఇది సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని చంద్రబాబు ప్రకటించగా.. దీనిపై అశ్వథ్థామ హతః.. అన్న టైపులో ఉద్దేశపూర్వక మౌనం వహించాడు. సింగపూర్ లోని ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా.. ఈశ్వరన్ ఎక్కడా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. 


(బాబు నాడు కుదుర్చుకున్న అమరావతి ఒప్పందం, సంతకం చేస్తున్నది ఈశ్వరన్)

కేసులో తాజా అప్ డేట్స్ ఏంటీ?

హూంగ్‌ బెంగ్ సెంగ్‌ ను తన కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన CPIB సంస్థ.. ఈశ్వరన్ తో లావాదేవీల గురించి లోతుగా ప్రశ్నించినట్టు సింగపూర్ మీడియా పేర్కొంది. తనకు ఇప్పటికే విదేశాల్లో ఇతర షెడ్యూల్ ఉందని, ఆ మేరకు బెయిల్ ఇవ్వాలని హూంగ్‌ బెంగ్ సెంగ్‌ కోర్టులో అభ్యర్థించారు. ఆ మేరకు షరతులతో కూడిన బెయిల్ ను హూంగ్‌ బెంగ్ సెంగ్‌కు మంజూరు చేసింది. అయితే విదేశీ పర్యటన నుంచి వెనక్కు రాగానే.. హూంగ్‌ బెంగ్ సెంగ్‌ తన పాస్ పోర్టును CPIB సంస్థకు అప్పగించాలని సూచించింది. అలాగే బెయిల్ మంజూర్ చేయడానికి ఒక లక్ష అమెరికన్ డాలర్లను పూచీకత్తుగా పెట్టాలని కోర్టు సూచించింది. అలాగే ఈశ్వరన్ కు సంబంధించిన లావాదేవీల పూర్తి రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. 

ఈశ‍్వరన్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

సింగపూర్‌ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్‌.ఈశ్వరన్‌  తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా సీపీఐబీ ఓ అంచనాకు వచ్చింది. సేకరించిన ఆధారాల మేరకు ఈశ్వరన్‌ను విచారిస్తున్నామని సీపీఐబీ డైరెక్టర్‌ డెనిస్‌ టాంగ్‌ తెలిపారు. ఈ కేసును కొందరు మరో కేసుతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మొదటి కేసు పార్లమెంటుకు సంబంధించిందని, దాంట్లో ఎలాంటి అవకతవకలు లేవన్నారు టాంగ్. అయితే ఈశ్వరన్ పై ఇప్పుడు పెట్టిన కేసు.. CPIB స్వయంగా గుర్తించిందని, ఆ మేరకు అభియోగాలు నమోదు చేసి, ప్రధానికి సమాచారం అందించామన్నారు డైరెక్టర్ టాంగ్. 

ఇదీ చదవండి: చంద్రబాబు సింగపూర్‌ పార్టనర్‌ ‘ఈశ్వరన్‌’ ఔట్‌

Advertisement
Advertisement