పైలట్‌ లేకుండా నింగిలోకి..

Black Hawk Helicopter Takes To Skies Without Pilots For The First Time - Sakshi

అమెరికాలో తొలిసారి పూర్తిస్థాయిలో పైలట్‌రహిత హెలికాప్టర్‌ ప్రయోగం... 

యుద్ధక్షేత్రాల్లో సైనికులకు సహాయకారిగా ఉంటుందంటున్న నిపుణులు 

మనం డ్రైవర్‌రహిత కార్లు చూశాం. అయితే అమెరికాలో మొదటిసారి పూర్తిస్థాయిలో పైలట్‌రహిత హెలికాప్టర్‌ ఆకాశంలోకి ఎగిరింది. మరి దీన్ని యుద్ధక్షేత్రాల్లో కూడా వినియోగించ వచ్చా? దాని విశేషాలు ఏంటి?  ఓ లుక్కేద్దాం!
–సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ 

4వేల అడుగుల ఎత్తులో.... 
బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్‌ ఈనెల 5న అమెరికా కెంటకీలోని ఫోర్ట్‌ క్యాంప్‌బెల్‌ నుంచి పైలట్‌ లేకుండా టేకాఫ్‌ అయింది. యూహెచ్‌–60ఏ బ్లాక్‌హాక్‌ అనే ఈ హెలికాప్టర్‌ ప్రయోగ సమయంలో 30 నిమిషాలపాటు గగనతలంలో చక్కర్లు కొట్టింది. 4వేల అడుగుల ఎత్తులో గంటకు 115–125 మైళ్ల వేగంతో ప్రయాణించింది. అమెరికా రక్షణ పరిశోధన సంస్థకు చెందిన ‘అలియాస్‌’ అనే సాంకేతికతను వినియోగించి అందులో పైలట్‌ లేకుండాహెలికాప్టర్‌ను ఆపరేట్‌ చేశారు.

కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు.. పైలట్‌ దాన్ని నియంత్రించలేని పరిస్థితి వచ్చినప్పుడు స్వయంప్రతిప్రత్తి వ్యవస్థకు అనుసంధానించేలా దీన్ని రూపొందించారు. అంటే పైలట్‌ బదులు ‘కంప్యూటర్‌ బ్రెయిన్‌’ దీన్ని నియంత్రిస్తుంది. అమెరికా రక్షణ ఆయుధాల పరిశోధన ప్రాజెక్టుల సంస్థ (డీఏఆర్‌పీఏ), లాక్‌హీడ్‌ మార్టిన్‌ సికోర్‌స్కీ అనే వైమానిక సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.  

మనుషుల ప్రాణాలను కాపాడొచ్చు... 
‘ఎయిర్‌క్రూ లేబర్‌ ఇన్‌–కాక్‌పిట్‌ ఆటోమేషన్‌ సిస్ట మ్‌ (అలియాస్‌)’ అనే సాంకేతికతతో దీన్ని రూపొందించారు. ప్రయాణ సమయంలో ఆటంకాలు వస్తే ఎలా నియంత్రించాలనే అంశాన్ని కూడా ఈ ప్ర యోగంలో పరీక్షించారు.  మానవరహిత హెలికాప్ట ర్‌ నేలమీద ల్యాండ్‌ అయి దాని బ్లేడ్లు తిరగడం ఆగి న తర్వాత ఇద్దరు పైలట్లు అందులోకి వెళ్లి దాన్ని మానవ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అనంతరం దాన్ని బేస్‌లోకి తీసుకెళ్లారు. పైలట్‌కు ఎలాం టి అపాయం కలగకుండా ఉండేందుకు ఈ అటానమస్‌ హెలికాప్టర్‌ను యుద్ధక్షేత్రాల్లోకి కూడా పంపవచ్చని అంటున్నారు. యుద్ధానికి అవసరమైన సా మగ్రిని దీని ద్వారా తరలించవచ్చని చెబుతున్నారు.

విమానం గగనతలంలో ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా దృశ్యస్పష్టత తగ్గినప్పుడు పైలట్‌ ఈ సాంకేతికతను ఉపయోగించి అటానమస్‌ మోడ్‌కు అనుమతించి ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చని అంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో పైలట్లు ఎలాంటి సంకోచం లేకుండా పూర్తి విశ్వాసంతో అటానమస్‌ మోడ్‌కు అనుసంధానించవచ్చని ఫోర్ట్‌ క్యాంప్‌బెల్‌కు చెందిన లీడ్‌ పైలట్‌ బెంజమిన్‌ విలియమ్సన్‌ చెప్పారు. ‘ఎప్పుడు అవసరమైతే అప్పుడు అటానమీ మోడ్‌కు, పైలట్‌ మోడ్‌కు మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ప్రమాదకర పరిస్థితులను గుర్తించడంలో, వాటిని అధిగమించడంలో ఈ సాంకేతికత ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రమాదాలను కూడా నివారించి మనుషుల ప్రాణాలను కాపాడవచ్చు’ అని పేర్కొన్నారు.

సురక్షితంగా ల్యాండింగ్‌... 
‘అలియాస్‌’ అనే సాంకేతికతను బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌లోగానీ, విమానంలో గానీ వినియోగించడం మొదటిసారి కాదని, మానవరహితంగా గాల్లోకి ఎగరడం, ల్యాండ్‌ అవడం మాత్రం ఇదే మొదటిసారని సంబంధిత వర్గాలు చెప్పాయి. సాధారణంగా ఎక్కువ విమానాల్లో అటానమస్‌ సాంకేతికతను పైలట్లకు సహాయకారిగా వాడతారు. అదికూడా చిన్నచిన్న టాస్క్‌ల కోసమే వినియోగిస్తారు. కానీ సంక్లిష్టమైన, ఊహించని పరిస్థితులు తలెత్తినప్పుడు మానవ పైలట్‌లకే వదిలేస్తారు.

కానీ బ్లాక్‌హాక్‌లో వినియోగించిన ‘అలియాస్‌’ అనేది మానవప్రమేయం లేకుండా పూర్తిగా అటానమస్‌ వ్యవస్థమీద ఆధారపడి పనిచేస్తుంది. చిన్నచిన్న పనులే కాకుండా అన్ని రకాల వ్యవహారాలను చక్కపెడుతుంది. అత్యవసర సమయాల్లో కూడా సురక్షితంగా ల్యాండ్‌ చేసే నైపుణ్యం దీని సొంతం. ఒకవేళ గాల్లో ఎగురుతున్నప్పుడు ఉన్నట్టుండి రెండు ఇంజన్లు కూడా ఫెయిలైతే అప్పుడు కూడా మానవప్రమేయం లేకుండా సురక్షితంగా ల్యాండ్‌ అవుతుంది. ఇది పైలట్లు ఉన్నా లేకున్నా కూడా సైనికులకు రాత్రి పగలు అనే తేడా లేకుండా అన్నివేళలా సహాయకారిగా ఉంటుందని అలియాస్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ స్టువర్ట్‌ యంగ్‌ వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top