నెత్తురోడిన పోలీస్ చెక్‌పోస్ట్.. 12 మంది బలి | bannu militant attack fateh khel khyber pakhtunkhwa | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన పోలీస్ చెక్‌పోస్ట్.. 12 మంది బలి

May 10 2026 1:11 PM | Updated on May 10 2026 1:44 PM

bannu militant attack fateh khel khyber pakhtunkhwa

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో మరో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బన్ను ప్రాంతంలో గల ఓ పోలీస్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు  విరుచుకుపడ్డారు. కారు బాంబు, ఆటోమేటిక్ ఆయుధాలు, డ్రోన్ల సహాయంతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 12 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృత్యువులా దూసుకొచ్చిన కారు బాంబు
ఈ దారుణ ఘటన బన్నులోని ఫతే ఖేల్ ప్రాంతంలో  చోటుచేసుకుంది. రాత్రి సమయంలో ఆత్మాహుతి దళానికి చెందిన ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన కారుతో పోలీస్ చెక్‌పోస్ట్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టాడు. కారు బాంబు పేలుడు ధాటికి చెక్‌పోస్ట్ ధ్వంసం కాగానే, అప్పటికే పొంచి ఉన్న ఇతర ఉగ్రవాదులు ఒక్కసారిగా లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఊహించని దాడిలో 12 మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరొక అధికారి ఆచూకీ గల్లంతైంది.

దాడిలో డ్రోన్లు, భారీ ఆయుధాలు
ఈ దాడిని ఉగ్రవాదులు అత్యంత పకడ్బందీగా అమలు చేసినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు కేవలం తుపాకులకే పరిమితం కాకుండా, క్వాడ్‌కాప్టర్లను (చిన్న డ్రోన్లు), భారీ ఆయుధాలను సైతం వినియోగించడం దాడి తీవ్రతకు అద్దం పడుతోంది. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి సులభంగా తప్పించుకున్నారని, వెళ్తూ పోలీసుల ఆయుధాలతో పాటు కొందరు సిబ్బందిని కూడా తమ వెంట తీసుకెళ్లారని ఓ సీనియర్ అధికారి  వెల్లడించారు.

ముమ్మరంగా గాలింపు చర్యలు
ఈ భీకర దాడి నేపథ్యంలో అప్రమత్తమైన పాక్ అధికారులు ఆ ప్రాంతం అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్లు, గాలింపు చర్యలు చేపట్టారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భద్రతా బలగాల చెక్‌పోస్టులు, పెట్రోలింగ్ యూనిట్లే లక్ష్యంగా ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడుతుండటం సరిహద్దుల్లో అస్థిరతకు దారి తీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement