అధికార బదిలీకి అన్ని ఏర్పాట్లు చేశాం!

Americans Worry About Transfer Of Power - Sakshi

వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడి

వాషింగ్టన్‌: జనవరిలో అధ్యక్ష అధికార బదిలీకి అవసరమైన చట్టబద్ధ ఏర్పాట్లన్నింటినీ ట్రంప్‌ప్రభుత్వం పూర్తి చేసిందని వైట్‌ హౌస్‌ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో విజేత ఎవరో రాజ్యాంగబద్ధంగా నిర్ణయించే ప్రక్రియ జరుగుతుందని తెలిపాయి. ఎన్నికల్లో జోబైడెన్‌ గెలుపును గుర్తించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పలు అవకతవకలు జరిగాయని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. ప్రధాన మీడియా ప్రకారం బైడెన్‌కు 306, ట్రంప్‌నకు 232 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు 270 ఓట్లు అవసరం.

ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం వైట్‌హౌస్‌ ప్రెస్‌సెక్రటరీ ‌మెకెనీ మాట్లాడుతూ బైడెన్‌ గెలుపును గుర్తించేందుకు నిరాకరించారు. పోలైన ప్రతి లీగల్‌ ఓటును లెక్కించాలన్నదే ట్రంప్‌ అభిమతమన్నారు. ఓటింగ్‌లో మోసాలు జరిగినట్లు నిజమైన ఆరోపణలున్నాయని చెప్పారు, కానీ ఇందుకు తగు ఆధారాలను చూపలేదు. ఇదే సమయంలో అధికార బదిలీకి అవసరమైన  ఏర్పాట్లను వైట్‌హౌస్‌ చేసిందని తెలిపారు. జనవరి 20న బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిఉంది. మరోవైపు అనేక కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ట్రంప్‌ఆశ పెట్టుకున్నట్లు మీడియా అంచనా వేస్తోంది. ఆయా రాష్ట్రాల గవర్నర్లు తననే విజేతగా ప్రకటిస్తారని ట్రంప్‌ ఆశిస్తున్నారని తెలిపింది.

ట్రంప్‌ ఆమోద ముద్ర లేకపోవడంతో అధికార బదిలికీ అవసర ఏర్పాట్లను జీఎస్‌ఏ ఇంతవరకు చేపట్టలేదు. ఇందుకు అవసరమైన 90 లక్షల డాలర్ల నిధులు కూడా విడుదల కాలేదు. ఇప్పటివరకు జీఎస్‌ఏ అధిపతి ఎమిలీ మర్ఫీ బైడెన్‌ గెలుపును గుర్తించలేదు. ఈ నేపథ్యంలో జీఎస్‌ఏ తగు సమయంలో స్పందిస్తుందని, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ జరుగుతోందని మెకెనీ చెప్పారు. మరోవైపు డిసెంబర్‌ 14న ఎలక్టోరల్‌ కాలేజీ సమావేశాన్ని ప్రభావితం చేసేలా ట్రంప్‌ యత్నిస్తున్నారని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు. విస్కాన్సి న్‌లోని రెండు కౌంటీల్లో జరుగుతున్న రీకౌంటింగ్‌లో అక్రమ బ్యాలెట్లను లెక్కిస్తున్నారని ట్రంప్‌ అభ్యంతరాలు చెబుతున్నారు.  

జనవరి 20నే ట్విట్టర్‌ ఖాతా
అమెరికా అధ్యక్షుడి అధికారిక ఖాతా @POTUS ను జనవరి 20న బైడెన్‌ చేతికి అప్పగిస్తామని ట్విటర్‌ ప్రకటించింది. అప్పటికి ట్రంప్‌ తన ఓటమిని ఒప్పుకోకున్నా అధికారిక అకౌంట్‌ను బైడెన్‌కు అందిస్తామని తెలిపింది. ట్రంప్‌నకు ఈ అకౌంట్‌తో పాటు విడిగా @realDonaldTrump పేరిట మరో ఖాతా ఉంది. పోటస్‌ఖాతాను బైడెన్‌కు అప్పగించాక, ఇప్పటివరకు అందులో ఉన్న ట్వీట్లు అర్కైవ్స్‌లోకి వెళతాయని ట్విటర్ తెలిపింది. దీంతో పాటు @whitehouse, @VP, @FLOTUS లాంటి పలు అధికారిక ఖాతాలు సైతం జనవరి 20న చేతులు మారతాయని ట్విటర్‌ తెలిపింది. పోటస్‌ ఖాతాకు ప్రస్తుతం 3.2 లక్షల మంది ఫాలోయర్లున్నారు. మరోవైపు జార్జియాలో బైడెన్‌ గెలిచినట్లు ఆ రాష్ట్ర  గవర్నర్‌ అధికారికంగా సర్టిఫై చేశారు. ఫలితాల్లో గెలుపు స్పష్టం కావడంతో వచ్చేవారం బైడెన్‌ తన కేబినెట్‌ సభ్యుల పేర్లను ప్రకటించవచ్చని మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ జాబితాలో కీలక ఇండో అమెరికన్లు ఉంటారని భావిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top