
ప్రస్తుతం టెక్నాలజీ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయింది. ఒకప్పుడు మానవుల కనీస అవసరాలంటే కూడు, గూడు, గుడ్డ అనేవారు. ఈ మూడింటితోపాటు ప్రస్తుత సమాజంలో సెల్‌ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా కూడా మానవ కనీస అవసరాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు సోషల్ మీడియా వినియోగం పెరుగుతోంది. ప్రపంచ జనాభాలో 62.5 % మంది ఇంటర్నెట్ వాడుతుండగా.. 58.4% మంది సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. 2021 జనవరి నాటికి 420 కోట్ల మంది సోషల్ మీడియా వినియోగిస్తుండగా.. ఈ సంఖ్య 2022 జనవరి నాటికి 10.1 శాతం వృద్ధిచెంది 462 కోట్లకు పెరిగింది. ఈ విషయం ‘గ్లోబల్ సోషల్ మీడియా స్టాటిస్టిక్స్ రీసెర్చ్ సమ్మరి–2022లో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఏడాది కాలంలో 42.4 కోట్ల మంది ఆన్‌లైన్ వేదికలోకి కొత్తగా చేరారు. ఇంటర్నెట్‌ను వాడుతున్న వారిలో 93.4% మంది ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వినియోగిస్తున్నారు. వినియోగదారులు సోషల్ మీడియాను రోజుకు సగటున 2:27 గంటలు ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా వినియోగదారుల్లో 74.8% మంది 13 ఏళ్లకు పైగా వయసున్న వారే.
-సాక్షి, అమరావతి
మొదటి స్థానంలో ఫేస్‌బుక్
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వినియోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ అగ్రస్థానంలో ఉంది. 291 కోట్ల మంది ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు. 265.2 కోట్ల మంది వినియోగదారులతో యూట్యూబ్ రెండోస్థానంలో, 200 కోట్ల మందితో వాట్సాప్ మూడోస్థానంలో ఉన్నాయి. ఫేస్‌బుక్ వినియోగదారుల్లో 56.4 శాతం పురుషులే. పురుషులు, మహిళల్లో 25–34 ఏళ్ల వయసు వారే ఎక్కువమంది వినియోగదారులు.
ప్రాంతాల వారీగా మొత్తం జనాభాలో సోషల్ మీడియా వినియోగదారుల శాతం
ప్రాంతం శాతం
ఉత్తర యూరప్ 85
పశ్చిమ యూరప్ 84
ఉత్తర అమెరికా 82
దక్షిణ అమెరికా 79
తూర్పు ఆసియా 69
దక్షిణ ఆసియా 45
పశ్చిమ ఆఫ్రికా 16
మధ్య ఆఫ్రికా 8