ముషీరాబాద్: గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 121ను రద్దు చేసి వీఆర్‌ఓలను రెవెన్యూ శాఖలోకి తీసుకురావాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గరిగె ఉపేందర్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల వీఆర్‌ఓల పరిస్థితి అధ్వానంగా తయారైందని వాపోయారు. బుధవారం రాంనగర్‌లోని ఎస్‌ఆర్‌టీ కాలనీ కమ్యూనిటీహాల్‌లో తెలంగాణ వీఆర్‌ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వీఆర్‌ఓలను రద్దుచేసి వివిధ శాఖల్లో నిర్వీర్యమైన పోస్టులు ఇచ్చి తమ జీవితాలను చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వీఆర్‌ఓలను రెవెన్యూశాఖలో చేర్చి వారికి ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగంలో చనిపోయిన వీఆర్‌ఓల పిల్లలకు కారుణ్య నియామకాలు జరపాలని కోరారు. వీఆర్‌ఓల అర్హతలను బట్టి ప్రమోషన్లు కల్పించాలన్నారు. తమ సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు వెంటనే స్పందించి న్యాయం చేయాలని లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘం ఉపాధ్యక్షుడు కృష్ణ, కోశాధికారి ప్రసాద్‌బాబు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విజయనాథ్, వివిధ జిల్లాల అధ్యక్షులు ప్రకాష్‌రావు, వీరస్వామి, కృష్ణమూర్తి, వెంకటేష్, నర్సింహులు, గోవర్థనచారి, కృష్ణమ్మ, రాఘవేందర్, మద్దిలేటి తదితరులున్నారు.
బండ్లగూడ జాగీర్
మాజీ మేయర్‌పై అట్రాసిటీ కేసు
రాజేంద్రనగర్: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్‌తోపాటు మరో ఏడుగురిపై రాజేంద్రనగర్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..నాలుగు రోజుల క్రితం సన్ సిటీలో జరిగిన హరితహారం కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ లతా ప్రేమ్ గౌడ్‌పై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే ఇరు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. ఈ సందర్భంగా ఒకటవ డివిజన్ కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్‌ను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు మాజీ మేయర్ మహేందర్ గౌడ్‌తో పాటు మరో ఏడుగురిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.