సాక్షి, వరంగల్: ప్రజాసమస్యలకు సమాధానాలు చెప్పాల్సిన అధికారులు అసంపూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావడంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన కలెక్టరేట్‌లో గురువారం జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి ఎంపీలు కడియం కావ్య, బలరాంనాయక్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ సారయ్య, అదనపు కలెక్టర్‌ర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం.. 11.30 గంటలకు మొదలుకావడం, ఆ తర్వాత వ్యవసాయం, వైద్యం, విద్యపై చర్చ ముగియగానే మీటింగ్ ముగిసింది. ఎజెండా ప్రతులు అందలేదని ఎంపీ కడియం కావ్య పేర్కొనడంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌సత్యశారద స్పష్టం చేశారు.
ఏడాదిన్నరగా ఏం చేస్తున్నట్టు..?
ఖానాపురం పీహెచ్‌సీ, కాశిబుగ్గ యూపీహెచ్‌సీ, రంగశాయిపేట యూపీహెచ్‌సీ, ఎస్‌ఆర్‌ఆర్ తోట యూపీహెచ్‌సీల కొత్త భవనాలకు ఒక్కోదానికి రూ.1.43 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయని, కొన్ని పనులు టెండర్ దశలో, మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పనుల్లో పురోగతి మందగించడంపై డీఎంహెచ్‌ఓను ఎంపీ కడియం కావ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మందలించారు.
ఎంజీఎంలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉండేందుకు వైద్యులు సమయపాలన పాటించాలని ఎంపీ కడియం కావ్య సూచించారు. సీసీటీవీ పర్యవేక్షణలో ఉదయం బయోమెట్రిక్ వేస్తున్న వైద్యులు.. సాయంత్రం మాత్రం బయోమెట్రిక్ నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్ రికగ్నేషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్)ను పకడ్బందీగా అమలుచేస్తే వైద్యులు సమయపాలనతో, పేదలకు వైద్యం గాడిలో పడుతుందని సూచించారు. ఆ తర్వాత విద్యారంగంపై చర్చ జరిగింది. కేంద్ర పథకాల సమాచారం సమగ్రంగా ఉండేలా పూర్తి నివేదికలతో తదుపరి దిశా సమావేశానికి రావాలని అధికారులకు ఎంపీ బలరాంనాయక్ సూచించారు.
వరంగల్ ‘దిశ’ సమావేశానికి అరకొర గణాంకాలతో హాజరైన అధికారులు
ప్రజాప్రతినిధుల ఆగ్రహం


