విద్యుత్‌ భద్రత బాధ్యత కావాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ భద్రత బాధ్యత కావాలి

May 5 2026 9:37 AM | Updated on May 5 2026 9:37 AM

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి

హన్మకొండ : విద్యుత్‌ భద్రత ఉద్యోగుల బాధ్యత కావాలని, విద్యుత్‌ ప్రమాదాలు లేని సంస్థ మన లక్ష్యమని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్‌భవన్‌లో టీజీ ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ సర్కిల్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌ భద్రత అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పని చేసే ప్రాంతాల్లో ఒక్క నిమిషం నిబంధన పాటించాలన్నారు. ఒక్క నిమిషం ఆగి భద్రతాపరికరాలు ధరించి, లైన్‌ మీద అవగాహన తెచ్చుకునే పని చేసే నిబంధన తీసుకొస్తామన్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో సాంకేతికతతో పని మొత్తం స్మార్ట్‌గా మారుతుందన్నారు. విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. దేశ అభివృద్ధిలో విద్యుత్‌ శాఖ కీలకంగా పనిచేస్తుందన్నారు. ప్రతీ వినియోగదారుడికి విద్యుత్‌ ప్రమాదాలపై అవగాహన కలిగిస్తూ, క్షేత్రస్థాయిలో పనిచేసే సమయంలో సిబ్బంది విద్యుత్‌ భద్రత పరికరాలు కచ్చితంగా వాడాలని ఆదేశించారు. కార్యక్రమంలో హనుమకొండ ఎస్‌ఈ బి.సామ్య నాయక్‌, డి.ఈ టెక్నికల్‌ విజేందర్‌ రెడ్డి, హనుమకొండ టౌన్‌ డి.ఈ జి.సాంబారెడ్డి, డి.ఈ హనుమకొండ రూరల్‌ పి.మల్లికార్జున్‌, ఎ.డి.ఈలు ఇంద్రసేనారెడ్డి, వంశీ కృష్ణ, అశోక్‌, దేవేందర్‌, మధుకర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, పైడయ్య, రాజేశ్వర్‌ రావు, ఏఈలు, సబ్‌ ఇంజనీర్లు, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం

కాపాడిన వాకర్స్‌ సభ్యులు

పోలీసులకు అప్పగింత

కాజీపేట: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండేళ్ల వయసున్న కూతురుతో కలిసి వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించగా వాకర్స్‌ సభ్యులు చూసి కాపాడారు. ప్రత్యక్షుల కథనం ప్రకారం.. కాజీపేట 63వ డివిజన్‌ జూబ్లీ మార్కెట్‌ ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మి (30) సోమవారం ఉదయం ఇంట్లో గొడవ జరగడంతో తన కూతురును తీసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి వడ్డేపల్లి చెరువు వద్దకు చేరుకుంది. చెరువులోకి దిగుతున్న సమయంలో వాకింగ్‌ చేస్తూ అటుగా వచ్చిన కురుమని మహేందర్‌ రెడ్డి ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమయ్యారు. వెంటనే సమీపంలో ఉన్న సహచర వాకర్ల సహకారంతో బాధితురాలిని బయటకు తీసుకొచ్చి ధైర్యం చెప్పారు. అనంతరం పోలీసులకు అప్పగించగా వారు కుటుంబీకులను పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపించారు. తల్లీకూతుళ్లను కాపాడిన వాకర్స్‌ సభ్యులను సీఐ సుధాకర్‌ రెడ్డి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement