మున్సిపల్ ఎన్నికలకు బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ సమాయత్తం అవుతోంది. నోటిఫికేషన్ కు ముందే సన్నాహక సమావేశాలు, అభ్యర్థుల ఎంపికలపై దృష్టి సారించింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ఎన్నికలు జరగనున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలను శనివారం నియమించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌లోని ప్రతీ మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడికి ఎన్నికల ఇన్‌చార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం ఈ సమన్వయకర్తల ప్రధాన బాధ్యత. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు వీరు నిరంతరం ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంటారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈ సమన్వయకర్తలు కీలక పాత్ర పోషిస్తారు. స్థానిక నాయకత్వంతో చర్చించి, గెలుపు గుర్రాలను గుర్తించి, నివేదికలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి సమర్పిస్తారు. అంతేకాకుండా, పార్టీ రూపొందించిన ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, బూత్ లెవల్ ఏజెంట్లను సమన్వయం చేయడం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు.
12 మున్సిపాలిటీలకు
ఇన్‌చార్జ్‌లు వీరే..
ఉమ్మడి వరంగల్‌లోని 12 మున్సిపాలిటీలకు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను, సీనియర్ నాయకులను ఇన్‌చార్జ్‌లుగా కేటీఆర్ నియమించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జనగామకు క్యామ మల్లేశ్‌ను నియమించారు. భూపాలపల్లికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ములుగుకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, నర్సంపేటకు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పరకాలకు వాసుదేవరెడ్డి, మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీకి మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మరిపెడకు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, తొర్రూరుకు మర్రి యాదవరెడ్డి, డోర్నకల్ మెట్టు శ్రీనివాస్, కేసముద్రం వై.సతీశ్‌రెడ్డి, వర్ధన్నపేటకు నాగుర్ల వెంకన్న బీఆర్‌ఎస్ మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు.
నియామక ఉత్తర్వులు జారీ చేసిన
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


