వరంగల్ బస్టాండ్ పనుల్లో వేగం పెంచాలి
అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: వరంగల్‌లో చేపట్టిన బస్టాండ్ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆ జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇన్నర్ రింగ్‌రోడ్డుకు సంబంధించిన పెండింగ్ చెల్లింపులు సమీక్షించి బిల్లులు క్లియర్ చేయాలన్నారు. రోడ్డు పనుల విషయంలో ఫేజ్–1లో పూర్తయిన పనుల పురోగతిని పరిశీలించి ఫేజ్–2లో రోడ్ల నిర్మాణానికి భూసేకరణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నగరంలోని ఉర్సుగుట్ట, దామెర చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులు వేగంగా చేయాలని ఆదేశించారు. పైడిపల్లి ప్రాంతం సుందరీకరణ, పాకాల సరస్సులో కొనసాగుతున్న పనులపై సమీక్ష నిర్వహించి మరింత అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఖిలావరంగల్ పురావస్తుశాఖ మ్యూజియంలోని మౌలిక వసతుల నిర్వహణ, సందర్శకుల సౌకర్యాలపై ఆరా తీశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో 5 ఎకరాల స్థలాన్ని అభివృద్ధి కోసం కుడాకు అప్పగించాలని జోనల్ మేనేజర్‌ను ఆదేశించారు. సమావేశంలో వరంగల్ ఆర్డీఓ సుమ, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్ జీఎం స్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు
పనిచేయాలి
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఈనెల ఒకటి నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నేపథ్యంలో కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలలను పనిలోకి తీసుకునే యాజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి రాజమణి, డీఈఓ రంగయ్యనాయుడు, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీసీపీఓ ఉమ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ వసుధ, సభ్యులు షాహెదా, మధు, సుజాత, రామలీల పాల్గొన్నారు.


