హౌస్‌ సిస్టం.. స్టూడెంట్‌ కౌన్సిల్‌! | - | Sakshi
Sakshi News home page

హౌస్‌ సిస్టం.. స్టూడెంట్‌ కౌన్సిల్‌!

Jan 20 2026 8:29 AM | Updated on Jan 20 2026 8:29 AM

హౌస్‌

హౌస్‌ సిస్టం.. స్టూడెంట్‌ కౌన్సిల్‌!

హౌస్‌ సిస్టం.. స్టూడెంట్‌ కౌన్సిల్‌!

విద్యారణ్యపురి: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా హౌస్‌ సిస్టం, స్టూడెంట్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని డీఈఓలకు ఆదేశాలు జారీచేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, మలుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఉన్న వివిధ పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.6,250 చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో స్టూడెంట్‌ కౌన్సిల్‌కు అవసరమయ్యే బ్లెజర్లు, షూ, బ్యాడ్జీల వంటి సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. జెండాలు, జెండా స్తంభాలు, నోటీస్‌ బోర్డుల వంటి సామగ్రిని స్పోర్ట్స్‌ గ్రాంట్‌, స్కూల్‌ గ్రాంట్స్‌ ద్వారా సమకూర్చుకోవాలి.

హౌస్‌ సిస్టం నిర్మాణం ఇలా..

ఒక్కో స్కూల్‌లో నాలుగు హౌస్‌లు ఏర్పాటు చేయాలి. ప్రతీ తరగతిని నాలుగు గ్రూపులు లేదా హౌస్‌లుగా విభజించాలి. మొత్తం పాఠశాలకు నాలుగు హౌస్‌లు ఉండాలి. విద్యార్థులకు హౌస్‌లు కేటాయించేటప్పుడు లింగ సమతుల్యత, సామాజిక నేపథ్యం సమతుల్యతను పాటించాలి. ప్రతీ హౌస్‌కు ఒక మెంటర్‌ టీచర్‌ను నియమించాలి.

నాలుగు హౌస్‌ల పేర్లు ఇలా.

● అబ్దుల్‌కలాం ఎరుపు, శకుంతలాదేవి అకుపచ్చ, సీవీరామన్‌ నీలం, రవీంద్రనాఽథ్‌ఠాగూర్‌ పసుపు.

● హౌస్‌ సిస్టంలో భాగంగా విద్యార్థి కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు. అందులో హెడ్‌ (బాయ్‌), హెడ్‌ (గర్ల్‌), నాలుగు హౌస్‌లకు కెప్టెన్లు, స్పోర్ట్స్‌ క్లబ్‌ సెక్రటరీలు, తరగతికి మానిటర్లు ఉంటారు. మొత్తంగా 25 మంది విద్యార్థులతో కూడిన కౌన్సిల్‌ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.

కౌన్సిల్‌ బాధ్యతలు ఇలా..

ఉదయం ప్రార్థన, విద్యార్థుల్లో క్రమశిక్షణ, పర్యవేక్షణ, మధ్యాహ్న భోజన పథకం అమలు పర్యవేక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, తల్లిదండ్రుల సమావేశాలకు హాజరయ్యేలా ప్రోత్సహించడం వంటి బాధ్యతలు ఉన్నాయి. అలాగే, హౌస్‌ల మధ్య క్రీడలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించడం, పాఠశాల కార్యక్రమాలు, ప్రచారాలకు నాయకత్వం వహించడం వంటి బాధ్యతలు కూడా విద్యార్థులే చేపట్టాలి. వివిధ రంగాల్లో నెలవారీగా సమావేశాలు, నాయకత్వ శిక్షణ సమావేశాలు కూడా ఉంటాయి.

పలు క్లబ్‌లతో అనుసంధానం

పాఠశాలల్లో ఇప్పటికే పలు క్లబ్‌లు ఉన్నాయి. ఎకో క్లబ్‌, బాలికా సాధికారత, కౌమార భద్రతాక్లబ్‌, ప్రహరీ క్లబ్‌, డిజిటల్‌ లెర్నింగ్‌, స్టీమ్‌, గ్రంథాలయ, సాహిత్య–సాంస్కృతిక క్లబ్‌, క్రీడలు, ఆరోగ్యం, పరిశుభ్రత క్లబ్‌లతో హౌస్‌లు, కౌన్సిల్‌ను అనుసంధానం చేస్తారు.

లక్ష్యాలు..

● విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, నిర్ణయ సామర్థ్యాన్ని ప్రోత్సహించడం.

● సహచరుల ఆదర్శప్రవర్తన ద్వారా పాఠశాల నియమాలు, క్రమశిక్షణ పాటించడం, సమావేశాలు, సహకారం, ఆరోగ్యకరమైన పోటీ భావాన్ని పెంపొందించడం.

● వ్యక్తీకరణకు ప్రతిభా వికాసానికి జీవననైపుణ్యాలు, అవకాశాలు కల్పించడం, సహపాఠ్య, అదనపు పాఠ్యకార్యకలాపాల ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించడం.

ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుకు నిధుల మంజూరు

ఉమ్మడి జిల్లాలో ఒక్కో స్కూల్‌కు రూ.6,250 నిధులు

జిల్లాల వారీగా పాఠశాలలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరాలు..

జిల్లా పాఠశాలలు నిధులు

(రూపాయల్లో)

హనుమకొండ 188 11,75,000

వరంగల్‌ 197 12,31,250

మహబూబాబాద్‌ 227 14,18,750

జనగామ 174 10,87,500

ములుగు 90 5,62,500

భూపాలపల్లి 125 7,81,250

హౌస్‌ సిస్టం, స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసుకోవాలి..

ఉన్నత పాఠశాలల్లో నాలుగు హౌస్‌లు విభజించాలి. హౌస్‌ సిస్టం, విద్యార్థి కౌన్సిల్‌ను ఏర్పాటుచేసి బాలబాలికలను అందులో చేర్చాలి. ఈ హౌస్‌ల మధ్య విద్య, క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించాలి. చదువుతోపాటు ఈ సహపాఠ్య అదనపు కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. పాఠశాలలో ప్రతీకార్యక్రమాన్ని ఈ కౌన్సిల్‌ ద్వారా నిర్వహించి హెచ్‌ఎంలు డీఈఓకు నివేదిక అందించాలి.

– బి.మహేశ్‌, సమగ్రశిక్ష ప్లానింగ్‌

కో–ఆర్డినేటర్‌, హనుమకొండ జిల్లా

హౌస్‌ సిస్టం.. స్టూడెంట్‌ కౌన్సిల్‌!1
1/2

హౌస్‌ సిస్టం.. స్టూడెంట్‌ కౌన్సిల్‌!

హౌస్‌ సిస్టం.. స్టూడెంట్‌ కౌన్సిల్‌!2
2/2

హౌస్‌ సిస్టం.. స్టూడెంట్‌ కౌన్సిల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement