అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి

Jan 20 2026 8:29 AM | Updated on Jan 20 2026 8:29 AM

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి

వరంగల్‌ అర్బన్‌: ‘అభివృద్ధి పనులకు టెండర్లు వేసి, అగ్రిమెంట్‌ పూర్తి చేసుకుని, నిర్ణీత గడువు ముగిసినా కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టడం లేదు. కొన్ని పనులు చేపట్టి, మధ్యలో నిలిపేశారు. ఇంజనీర్లను, కాంట్రాక్టర్లు ఎన్నిసార్లు ప్రశ్నించినా కదలిక లేదని పలువురు కార్పొరేటర్లు, కాలనీవాసులు గ్రేటర్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ అధికారుల సమక్షంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. డివిజన్ల వారీగా టెండర్లు పూర్తయిన పనులను గుర్తించి యుద్ధప్రతిపాదికన పూర్తి చేసేలా ఇంజనీర్లు సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. అనుమతి లేని, అక్రమ భవన నిర్మాణాలపై టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రీవెన్స్‌సెల్‌కు 71 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్‌ ప్లానింగ్‌కు 34, ఇంజనీరింగ్‌ సెక్షన్‌కు 18, రెవెన్యూ విభాగానికి 10, హెల్త్‌, శానిటేషన్‌కు 6, నీటి సరఫరా 3 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, ఎస్‌ఈ సత్యనారాయణ, సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్‌ లింగం, సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

● 22వ డివిజన్‌ బీరన్నకుంట కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం పూర్తి చేయాలని, కుట్టుశిక్షణ కేంద్రం, గ్రంఽథాలయాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు కోరారు.

● తూర్పు కోట 37వ డివిజన్‌లోని ఎస్సీ శ్మశాన వాటికలోని సమస్యలను పరిష్కరించాలని, కొత్తగా మరొకటి ఏర్పాటు చేయాలని ఆ వర్గానికి చెందిన ప్రతినిధులు వినతి పత్రం అందించారు.

● ఆరేపల్లిలో సర్వే నంబరు 485 బీరన్న దేవాలయ స్థలాన్ని ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారని, ఆ యాజమానిని ప్రశ్నిస్తే పలు ఫిర్యాదులు కురుమ కులస్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చర్యలు తీసుకోవాలని సంక్షేమ సంఘం నాయకులు విన్నవించారు.

● నగరంలో ప్లాస్టిక్‌ గ్లాస్‌లు, ప్లేట్లు, కవర్లు నిషేధించాలని కత్తి సాంబయ్య కోరారు.

● హనుమకొండ రెడ్డిపురంలో ఇంటి నంబరు 28–5–383/7/ఏ రోడ్డు అధ్వానంగా తయారైందని, కొత్తగా రోడ్డు మంజూరు చేయాలని కాలనీవాసులు కోరారు.

● ఏనుమాముల రోడ్డు నంబర్‌ 9లో రెండు నెలలుగా నల్లా నీళ్లు రావట్లేదని కాలనీవాసులు ఫిర్యాదు అందించారు.

● ఉర్సు 41వ డివిజన్‌ శ్మశాన వాటికల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్‌ మరుపల్లి రవి కోరారు.

● హనుమకొండ పద్మాక్షి కాలనీ మెయిన్‌ రోడ్డు నుంచి సాయిబాబా టెంపుల్‌ వరకు 30 ఫీట్ల రోడ్డును విస్తారించి అభివృద్ధి చేయాలని కాలనీవాసులు విన్నవించారు.

● హనుమకొండ ఎస్‌బీహెచ్‌, టీచర్స్‌ కాలనీ, చైతన్య నగర్‌ కాలనీలో వర్షపు నీరు స్తంభించి ఇళ్లలోకి చేరుతోందని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరారు.

● పెద్దమ్మ గడ్డ నుంచి కేయూకు వెళ్లే రోడ్డులోని పాత భద్రకాళి కాలువను ఆక్రమిస్తున్నారని చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ 4వ డివిజన్‌ అధ్యక్షుడు కంజర్ల మనోజ్‌ కుమార్‌ ఫిర్యాదు అందించారు.

● 43వ డివిజన్‌ గ్రామ దేవత పోచమ్మగుడి స్థలాన్ని కబ్జా చేశారని చర్యలు తీసుకోవాలని స్థానికుడు మైదం వీరస్వామి వినతి పత్రం అందించారు.

స్థానిక సమస్యలకు

పరిష్కారం చూపండి

గ్రేటర్‌ గ్రీవెన్స్‌కు 71 ఫిర్యాదులు

అర్జీలు స్వీకరించిన

కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement