సీఎం రేవంత్‌పై సీపీకి ఫిర్యాదు
● మతి భ్రమించి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
● మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, ధర్మారెడ్డి
వరంగల్ క్రైం: బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మెలు కూల్చాలని వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్‌కు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ఆదివారం ఖమ్మం జిల్లాలో జరిగిన సీపీఐ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ దిమ్మెలు కూల్చాలని అనడాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు అలుపెరగని ఉద్యమం చేసిన బీఆర్‌ఎస్‌ని విమర్శించే నైతిక హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు. తెలంగాణలో ఏ ఒక్క దిమ్మ కూలినా మహబూబాబాద్‌లో మాదిరిగా రాళ్లతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. మాజీ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం సభలో ముఖ్యమంత్రి మతిభ్రమించి మాట్లాడరని, బీఆర్‌ఎస్ గద్దెలు కూల్చితే కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉండదని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు విమోచన కమిటీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు, నాయకులు ఽశ్రీధర్, రజినీకాంత్ సీపీని కలిసిన వారిలో ఉన్నారు.


