ఎన్నికలకు భారీ బందోబస్తు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు కమిషనరేట్ పరిధిలో 6 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వాహనాలు తనిఖీ చేస్తూ డబ్బు, మద్యం అక్రమంగా రవాణా చేయకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను స్థానిక పోలీసులతోపాటు ఏసీపీ స్థాయి అధికారులు సందర్శించి పరిస్థితులను తెలుసుకున్నారు.
272 సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 272 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించి భద్రతను పటిష్టం చేశారు. కమిషనరేట్‌లో మొత్తం 807 పోలింగ్ స్టేషన్లు, 887 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొదటి విడత 269 పోలింగ్ స్టేషన్లు, 282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
విధుల్లో 2,028 మంది సిబ్బంది..
ఎన్నికల నిర్వహణ కోసం పోలీసు ఉనతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, 13 మంది ఏసీపీలు, 122 మంది ఇన్‌స్పెక్టర్లు, 412 మంది ఎస్సైలు, 1,154 ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుళ్లు, 285 హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజల్ సిబ్బందితో కలిపి మొత్తం 2,028 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు.
తుపాకుల డిపాజిట్
కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ కలిగిన తుపాకులను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే లైసెన్స్ హోల్డర్లు డిపాజిట్ చేశారు. బ్యాంకు సిబ్బంది తుపాకులు మినహాయించి 181 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా 36 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు.
భద్రత కట్టుదిట్టం..
కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. అనుమానిత వ్యక్తులను బైండోవర్ చేశాం. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశాం. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి.
– సన్‌ప్రీత్‌సింగ్, పోలీస్ కమిషనర్
కమిషనరేట్ పరిధిలో 887 పోలింగ్ కేంద్రాలు
6 చెక్‌పోస్టులు ఏర్పాటు..
36 ఫ్లయింగ్ స్క్వాడ్స్
181 తుపాకులు స్వాధీనం


