‘సెన్సార్’.. బేజార్!
‘గ్రేటర్’లో ఏటీసీఎస్ అమలవుతున్న 12 జంక్షన్లలో వాహనాల రద్దీ
సాక్షి, వరంగల్: సాధారణంగా ప్రతి ట్రాఫిక్ జంక్షన్‌లో నాలుగు రహదారులు ఉంటాయి. ఒక్కో రోడ్డుకు నిర్ణీత సమయం గ్రీన్‌లైట్, రెడ్‌లైట్ వెలుగుతూ సిగ్నల్ సైకిల్ నడుస్తుంది. అన్ని రోడ్లలో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు. అయినప్పటికీ ట్రాఫిక్ సైకిల్ సిగ్నల్‌లో మాత్రం మార్పు ఉండట్లేదు. ఫలితంగా గ్రీన్‌లైన్ పడిన రహదారులు ఖాళీగా ఉంటుండగా.. రెడ్‌లైట్లు ఉన్న రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ ప్రభావం ఆ జంక్షన్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై పడుతోంది. దీంతో అనేక చౌరస్తాల్లో సిబ్బంది మాన్యువల్‌గా ఆపరేట్ చేయాల్సి వస్తోంది. ఫిక్స్‌డ్ టైంతోనే ఆయా జంక్షన్లలో వాహనాల రద్దీ క్లియర్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు గ్రేటర్ వరంగల్‌లో అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టం (ఏటీసీఎస్)ను మూడేళ్ల క్రితం అమల్లోకి తెచ్చారు. ఎక్కువ రద్దీగా ఉండే 12 ట్రాఫిక్ జంక్షన్లలో ఇప్పటికీ మెజారిటీ అచేతనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. వీటిని పర్యవేక్షించాల్సిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కేవలం చిన్నపాటి మరమ్మతులకు పరిమితమవుతోంది తప్ప పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. రియల్ టైం ట్రాఫిక్ డాటాను ఆధారంగా చేసుకొని ఆటోమేటిక్‌గా ఎక్కువ వాహనాలు ఉన్న వైపు గ్రీన్‌సిగ్నల్ పడి ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన ఆ పరిస్థితి కనిపించడం లేదు. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణలోని నాలుగు జంక్షన్లలో ఫిక్స్‌డ్ టైంతోనే సిగ్నల్ సెట్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఏటీఎస్‌సీ ఉన్న జంక్షన్లకు, మాన్యువల్ జంక్షన్లకు పెద్ద తేడా లేకుండా పోయిందని, ఏటీఎస్‌సీ సరిగా పనిచేస్తే ట్రాఫిక్ పోలీసు సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని కొందరు పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
సెన్సార్లు సరిగా పనిచేయక..
డివైడర్లు మధ్యలో లేక
అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టం (ఏటీసీఎస్)తో నగరంలోని ఓ మార్గంలో ఉన్న నాలుగైదు జంక్షన్లు అనుసంధానమవుతాయి. ఆయా చౌరస్తాల్లో ఎన్ని వాహనాలు వస్తున్నాయని లెక్కించడానికి అవసరమైన పరిజ్ఞానం ట్రాఫిక్ కెమెరాల్లో ఉంటుంది. ఇవి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమవుతాయి. అక్కడ సర్వర్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ఈ వాహనాల సంఖ్య ఆధారంగా ఏ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ రూట్లకు ఎక్కువ సేపు గ్రీన్‌లైట్ పడేలా చేస్తోంది. గరిష్టంగా వంద సెకన్లు మాత్రమే ఇది ఉంటుంది. ఆపై రొటేషన్‌పై సిగ్నల్ సైకిల్ మొదలవుతుంది. జంక్షన్లలో ఉన్న సీసీటీవీ కెమెరాల సెన్సార్లు 90 మీటర్లలోపు ఉంటేనే క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. జంక్షన్లలోని ఓ మార్గంలో ఉన్న వాహనాలు అంతకుమించి దూరంలో ఉండడంతో అవి క్యాప్చర్ చేయలేకపోతున్నాయి. అదే సమయంలో ఆయా రహదారుల్లోని డివైడర్లు కూడా రోడ్డుకు సరిగ్గా మధ్య భాగంలో లేవు. దీంతో ఓవైపు ఎక్కువగా వాహనాలు, ఇంకోవైపు తక్కువ వాహనాలు ఉండడం వల్ల కూడా ఈ ఏటీసీఎస్ సరిగా పనిచేయక ఫిక్స్‌డ్ టైంనే సెట్ చేసుకొని ట్రాఫిక్ సిబ్బంది సేవలందిస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి అందుబాటులోకి తీసుకొచ్చినా ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగానే ఉండడంపై వాహనదారులు మండిపడుతున్నారు. అయితే ఈ విషయమై బల్దియా కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ 12 జంక్షన్లలో ఏటీసీఎస్ అమలవుతోంది, కొన్ని ప్రాంతాల్లో సమస్య ఉంది వాస్తవమేనని క్లియర్ చేస్తామన్నారు.
ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న జంక్షన్లు
న్యూశాయంపేట, మర్కజీ సెంటర్,
పెగడపల్లి డబ్బాలు, ఎర్రగట్టుగుట్ట.
బల్దియా ఆధ్వర్యంలో ఏటీసీఎస్ జంక్షన్లు..
వరంగల్ పోస్టాఫీస్, పోచమ్మమైదాన్, ఎంజీఎం సర్కిల్, ములుగు రోడ్డు, అశోకా జంక్షన్, సీపీఓ జంక్షన్, కేయూసీ జంక్షన్, గోకుల్ జంక్షన్, అదాలత్ జంక్షన్, వడ్డేపల్లి ఎక్స్ రోడ్డు జంక్షన్, కాజీపేట, కడిపికొండ బ్రిడ్జి.
యథావిధిగానే వాహనదారుల వెయింటింగ్
సెన్సార్ల క్యాప్చర్ పరిమితి
90 మీటర్ల లోపు ఉండడమే కారణం
పాత పద్ధతిలోనే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు
ఇప్పటికై నా బల్దియా దృష్టి
సారించాలంటున్న నగర ప్రజలు
‘సెన్సార్’.. బేజార్!


