తూర్పుకోటలో హత్య
ఖిలా వరంగల్: వరంగల్ తూర్పుకోటలో సోమవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో స్నేహితులు తోటి స్నేహితుడిని ఒంటరి చేసి దాడి చేయడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. తూర్పుకోటకు చెందిన కుమారస్వామి, రజిత దంపతుల కుమారుడు సంగరబోయిన సాయి (23) అదే ప్రాంతానికి చెందిన తన స్నేహితులు కలిసి సోమవారం రాత్రి మద్యం తాగారు. సాయి ఇంటి సమీపంలోనే అతనికి, స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. స్నేహితులు సాయిని ఒంటరి చేసి కర్రలతో దాడి చేయగా తీవ్రగాయాలతో రోడ్డుపై పడిపోయాడు. గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆటోలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సాయి అప్పటికే మృతిచెందినట్లు చెప్పినట్లు సమాచారం. దాడికి గల కారణాలు, ఎవరెవరు దాడిలో పాల్గొన్నారు.. అనే విషయాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.
యువకుడిపై స్నేహితుల దాడి
ఎంజీఎంకు తరలిస్తుండగా మృతి
ఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు


