
బల్దియా ఆవరణలో కోతులను విక్రయించిన కాంట్రాక్టర్
కోతులను అమ్మింది వాస్తవమే..
● ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం కెమెరాల్లో రికార్డు
● జీడబ్ల్యూఎంసీ అధికారుల వైఫల్యంపై విమర్శలు
● నాలుగున్నరేళ్లలో రూ.2.50 కోట్ల ఖర్చు
చేసినా
నగర ప్రజలకు తప్పని వానరాల బెడద
ఏ కాలనీలో చూసినా వానరాలే..
నగరంలో వానరాలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు కోతుల భయంతో వణికిపోతున్నారు. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, పండ్లు తీసుకుని వచ్చే సమయంలో దాడి చేస్తున్నాయి. మీదపడి చేతుల్లో ఉన్న కవర్లను, సంచులను లాక్కొనిపోతున్నాయి. ఒకవేళ ఇవ్వకపోతే పెద్దపెట్టున అరుస్తూ గుంపుగా వెంబడిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జారవిడవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో రెండో కాకుండా పదుల సంఖ్యలో ప్రత్యక్షమవుతున్నాయని పేర్కొంటున్నారు. కోతులు ఆకలి, దప్పిక సమయాల్లో ఇళ్లలోకి చొరవడి పండ్లు, కూరగాయలు తదితర సామగ్రిని ఎత్తుకపోతున్నాయి. ఇంటి పనులు చేస్తున్న మహిళలపైన దాడులు చేస్తున్నాయి. దీంతో ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇంటి పరిసరాల్లో ఏమైనా పదార్థాలు చేతుల్లో కనిపిస్తే చాలు మీద పడి కరుస్తూ వాటిని తీసుకెళ్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ అర్బన్: వినడానికి విచిత్రం.. చూస్తే సచిత్రం, కనిపిస్తే ఆందోళనకరం.. ఇదేంటి ఇలా అంటున్నారు అనుకుంటున్నారా.. అదేనండి వరంగల్ మహానగరంలో కోతులు ఇళ్లు, రోడ్లు తేడా లేకుండా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. నివాసాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలు ఎదురు దాడికి దిగేందుకు రంకెలేస్తున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే మరో కొత్తకోణం వెలుగు చూడడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కోతులను పట్టుకునే కాంట్రాక్టర్ తాజాగా కొన్ని కోతులను బల్దియా ఆవరణ నుంచి అమ్మకానికి పెట్టాడు. ఓ ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసి కారులో తరలించడం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం (ఐసీసీసీ) కెమెరాల్లో రికార్డు కావడం, బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కోతిని పట్టుకొని తరలిస్తే రూ.550
ఒక్కో కోతిని పట్టేందుకు జీడబ్ల్యూఎంసీ చెల్లిస్తున్నది అక్షరాలా రూ.550. ఒకవేళ పట్టిన వాటిని ఏటూరునాగారం అడవుల్లో వదిలేయడంతో పెద్ద అవినీతి జరుగుతోంది. చెల్లిస్తున్న పన్నుల నుంచి రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు కోతులను పట్టుకునేందుకు బల్దియా బడ్జెట్ కేటాయిస్తోంది. ఈ సొమ్ముతో ఎన్ని కోతులను పట్టుకొని, ఎక్కడ వదిలేస్తున్నారనే వివరాలను రికార్డుల్లో కాకిలెక్కలుగా మారాయి. ఫిర్యాదు వస్తే ఆయా కాలనీల్లో నాలుగైదు పెద్ద బోన్లు, ఐదు బాక్స్ బోన్లు పెడతారు. బోనులో కోతులు పడేందుకు అరటిపండ్లు, పల్లీలు ఎరగా వేస్తారు. వరుసగా రెండు రోజులపాటు వీటిని తినేందుకు కోతులు వస్తాయి. మూడోరోజు బోనులో కోతులు చిక్కుతాయి. ఇందుకోసం బల్దియా ప్రత్యేకంగా వాహనాన్ని సమకూరుస్తుంది. ఇదే తరహాలో కోతులను పట్టుకుంటారు. కానీ, నగరంలో కోతుల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పట్టుకున్న కోతులను జీపీఎస్ కలిగి ఉన్న వాహనంలో తరలిస్తూ ఏటునాగారం అడవుల్లో వదిలేయాలి. అటవీ శాఖ అధికారి సంతకం తీసుకుంటున్నామని నమ్మలేని నిజాలు సృష్టిస్తుండడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగున్నర ఏళ్ల కాలంలో సుమారు రూ.2.50 కోట్ల మేరకు నిధులు వెచ్చించినా నగరంలో కోతలు బెడద ఎక్కువగా ఉన్నట్లు జీడబ్ల్యూఎంసీ అధికారులే చెబుతుండడం విశేషం.
బల్దియా ప్రధాన కార్యాలయ
ఆవరణ నుంచి కోతులను
తరలిస్తున్న
కారు
నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్ తాజాగా ఐదు కోతులను అమ్మిన మాట వాస్తవమే. సీసీ ఫుటేజీలను పరిశీలించి సదరు వ్యక్తులను విచారించాం. అవి కోతులు కావని, కొండముచ్చులను పట్టుకొని అమ్మినట్లు అంగీకరించారు. విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం.
– రాజారెడ్డి, సీఎంహెచ్‌ఓ