బీసీ బంద్ సక్సెస్
గ్రేటర్‌లో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థల మూసివేత
హన్మకొండ/వరంగల్‌చౌరస్తా: గ్రేటర్ వరంగల్ పరిధిలో బీసీ బంద్ ప్రశాంతంగా విజయవంతమైంది. శనివారం నగరవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, సినిమా హాళ్లు మూసివేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీలు రోడ్డెక్కారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ర్యాలీలు తీయడంతో పోరు హోరెత్తింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి, బీఆర్‌ఎస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు వేకువజామునే ఆర్టీసీ జిల్లా బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వరంగల్–1 డిపో గేట్‌లో బైఠాయించి బస్సులు అడ్డుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో బంద్ ప్రశాంతంగా సాగింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేశాయి. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు వరంగల్ మహానగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ కూడలి నుంచి ములుగు క్రాస్ రోడ్డులోని జ్యోతిబా పూలే విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహంనుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్‌ఎస్ నాయకులు హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌కు చేరుకుని బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు వడ్లకొండ వేణుగోపాల్, దొడ్డిపల్లి రఘుపతి, బొనగాని యాదగిరి గౌడ్, తమ్మెల శోభారాణి, మూగల కుమార్ యాదవ్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం బాస్కర్, బీఆర్‌ఎస్ నాయకులు చింతం సదానందం, శోధన్, పులి రజనీకాంత్, పోలెపల్లి రామ్మూర్తి, ముత్తిక రాజు, శ్రీధర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్ రావు, నాయకులు తోట వెంకటేశ్వర్లు, రవీందర్, పోతుల శ్రీమాన్, విజయశ్రీ, సతీష్, బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వరంగల్‌లో..
వరంగల్‌లో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ర్యాలీలు, రాస్తారోకోలు చేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా షాపులు మూసివేశాయి. వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్, వాణిజ్య రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. వరంగల్ వామపక్షాల నాయకులు హెడ్‌పోస్టాఫీస్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. ఎంసీపీఐ (యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్, సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, సీపీఐ ఎంఎల్ (న్యూడెమొక్రసీ) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, రఘుసాల సుమన్, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి, రాచర్ల బాలరాజు పాల్గొన్నారు. బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు ఆధ్వర్యంలో వరంగల్ శివనగర్‌లోని తమ్మెర భవన్ నుంచి సీపీఐ, బీసీ హక్కుల సాధన సమితి కార్యకర్తలు ప్రదర్శనగా బయల్దేరి అండర్ బ్రిడ్జి రోడ్డు, స్టేషన్ రోడ్డు, పోస్టాఫీస్ సెంటర్, వరంగల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఎం నాయకులు వరంగల్ పోస్టాఫీస్ సెంటర్ నుంచి వరంగల్ చౌరస్తా, బట్టలబజార్, బీట్ బజార్‌లో ప్రదర్శన నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు అరూరి రమేశ్, జిల్లా కార్యదర్శి రంగయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం, పోచమ్మమైదాన్, మండిబజార్, ఆర్‌ఎన్టీ రోడ్డు, వరంగల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు రాజనాల శ్రీ హరి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
బీసీ సంఘాలు, వివిధ పార్టీల ర్యాలీలు
స్థానిక ఎన్నికల్లో 42 శాతం
రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
బీసీ బంద్ సక్సెస్
బీసీ బంద్ సక్సెస్


