కళాక్షేత్రం అందుబాటులోకి తీసుకురావాలి
హన్మకొండ కల్చరల్: సాహిత్య సభలను నిర్వహించుకునేలా కాళోజీ కళాక్షేత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. గురువారం సాయంత్రం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పీఆర్ భవన్‌లో పేర్వారం జగన్నాథం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కారాన్ని 2023 సంవత్సరానికిగాను సాహితీవేత్త డాక్టర్ లింగంపల్లి రామచంద్రకు, 2024 సంవత్సరానికి సాహితీవేత్త డాక్టర్ పెద్ది వెంకటయ్య, 2025 సంవత్సరానికి కవి పొట్లపల్లి శ్రీనివాసరావుకు ప్రదానం చేశారు. కేయూ విశ్రాంత ఆచార్యులు బన్న అయిలయ్య అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో డాక్టర్ అంపశయ్య నవీన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఆచార్య పేర్వారం జగన్నాథం తనకు సన్నిహితులని, ఆయన పేరిట స్మారక పురస్కారం అందించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈవీ శ్రీనివాసరావు, పేర్వారం జగన్నాథం ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ పేర్వారం శంకర్‌రావు, డాక్టర్ పేర్వారం శ్రీనాఽథ్, అస్నాల శ్రీనివాస్, కవయిత్రి గట్టు రాధికామోహన్, కవులు, రచయితలు పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్
ఘనంగా ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కార ప్రదానం


