సమగ్ర ప్రణాళిక రూపొందించండి
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలో బల్దియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెహికల్ షెడ్డు, సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో రోడ్ల నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సమర్థవంతంగా చేపట్టేందుకు అధికారులకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. అంతర్గత రహదారుల ఏర్పాటు, పార్కింగ్, డ్రెయినేజీ తదితర సమగ్ర అంశాలతో ప్లాన్ తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
కళాక్షేత్రంలో పనులు పూర్తి చేయండి
నయీంనగర్: కాళోజీ కళాక్షేత్రంలో పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాళోజీ కళాక్షేత్రంతో పాటు కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌లో కొనసాగుతున్న పనుల్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ‘కుడా’ వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. కళాక్షేత్రంలో కొనసాగుతున్న ఇంటీరియర్ పనుల్ని పరిశీలించి నాణ్యతలో రాజీపడకుండా వేగంగా పూర్తి చేయాలన్నారు. కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌లో ఫినిఫింగ్ పనుల్ని వేగంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ిసీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్ రావు పాల్గొన్నారు.


