హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు
వరంగల్ లీగల్ : హత్య కేసులో గొడుగు కావ్యకు జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధి స్తూ హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభిరామారావు మంగళవారం తీర్పు వెలువరించారు. పోలీసుల కథనం ప్రకారం హనుమకొండ బాలసముద్రానికి చెందిన భూమ రాజు, సిరి దంపతులు, చిట్యాల మండలం నైన్‌పాకకు చెంది ప్రస్తుతం నగరంలోని హంటర్‌రోడ్డులో నివాసముంటున్న గొడుగు గణేశ్, కావ్య దంపతులు స్నేహితులు. ఈ క్రమంలో ‘అచల’ చిట్‌ఫండ్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్న గణేశ్ ద్వారా భూమ రాజు రూ.10 లక్షల చిట్టీ వేశాడు. 2021 జనవరిలో చిట్టీ పాట పాడాడు. చిట్టీ ఫండ్ యాజమాన్యం సకాలంలో డబ్బులు చెల్లించలేదు. దీంతో మీ ద్వారా చీటి డబ్బులు చెల్లించామని, అందుకే మీరే బాధ్యత వహించాలని గణేశ్, కావ్య దంపతులపై భూమ రాజు దంపతులు ఒత్తిడి చేశారు. ఈ విషయంపై 2021, సెప్టెంబర్‌లో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో కోపోద్రిక్తురాలైన కావ్య.. మరోసారి డబ్బుల అడిగితే మీ ఇద్దరిని చంపుతానని బెదిరించింది. అయినా రాజు, సిరి దంపతులు డబ్బుల ఇవ్వాలని డిమాండ్ చేశా రు. దీంతో 2021, సెప్టెంబర్ 3న కావ్య పథకం ప్ర కారం రాజు పని చేసే హనుమకొండ డీసీసీ భవన్ వద్ద ఉన్న మొబైల్ రిపేర్ షాప్ వద్దకు వెళ్లింది. అప్పటికే సిరి కూడా అక్కడే ఉంది. ఈ క్రమంలో కావ్య తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ రాజుపై పోసి లైటర్‌తో నిప్పంటించింది. దీంతో ఎవరు నువ్వు అంటూ సిరి.. కావ్య మొహానికి ఉన్న స్కార్ఫ్ తీసే ప్రయత్నం చేసింది. అప్పటికే బాగా వ్యాపించిన మంటల్లో కావ్య స్కార్ఫ్ కూడా కాలింది. దీంతో సిరి తన భర్త రాజును బతికించుకునే ప్రయత్నంలో భా గంగా షాపులోపలికి వెళ్లగా కావ్య అక్కడి నుంచి పరారైంది. అనంతరం తన భర్త గణేశ్‌కు సమాచారం అందించగా ఇద్దరు కలిసి శివనగర్‌లోని తన చిన్నమ్మ ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు పోలీసుల గాలింపు చర్యలు తీవ్రం కావడంతో పారిపోవాలనే ఉద్దేశంతో కాశిబుగ్గ సెంటర్‌కు రాగా గుర్తించిన పోలీసులు ఇద్దరి అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం హత్యా నేరం కింది కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో కావ్య కు జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ, ఆమె భర్త గణేశ్‌ను నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు జడ్జి తీర్పులో పేర్కొన్నారు.


