
‘కలెక్టరేట్‌లో కామాంధుడు’ బదిలీ
హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఓ కామాంధుడి అరాచకంపై సమగ్ర వివరాలతో ‘సాక్షి’లో ‘కలెక్టరేట్‌లో కామాంధుడు’ శీర్షికన ప్రచురితమైన కథనం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో ఆ కామాంధుడి ఆకృత్యాల బారినపడిన మరికొందరు బాధితులు ‘సాక్షి’కి ఫోన్‌చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము సైతం ఫిర్యాదుకు సిద్ధమని తెలిపారు. ఏ విధంగా తమను వేధించాడో వివరించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కలెక్టరేట్ ‘ ఏ’ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆ కామాంధుడిని తక్షణ చర్యల్లో భాగంగా చింతగట్టు ఎస్సారెస్పీకి బదిలీ చేశారు. బాధితులతో మరోసారి నేరుగా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్న కలెక్టర్ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేశారు. కమిటీకి కన్వీనర్‌తోపాటు ఎన్జీఓ శాఖ ఉద్యోగులను సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.
‘సాక్షి’కి అభినందనలు
సంవత్సరాల కాలంగా కలెక్టరేట్‌లో పాతుకుపోయి ఉద్యోగులను వేధిస్తూ మహిళా ఉద్యోగులను లైంగికంగా ఇబ్బందులు పెడుతున్న సదరు కామాంధుడిపై సమగ్ర కథనం ప్రచురించి బాధితుల పరిస్థితి బాహ్య ప్రపంచానికి తెలియజేసిన ‘సాక్షి’కి కలెక్టరేట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ అక్రమార్కుడి బారిన పడిన ఇతర ఉద్యోగులు అతడి మరిన్ని అక్రమాలపై ‘సాక్షి’కి ఆధారాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. కామాంధుడి బాగోతంపై తీవ్రస్థాయిలో ఫిర్యాదులు అందాయి. వీరు సైతం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
‘సాక్షి’లో ప్రచురితమైన కథనం
సంచలనం రేపిన
‘సాక్షి’ కథనం
ఫిర్యాదుకు చేసేందుకు ముందుకు వస్తున్న మరికొందరు బాధితులు
ఘటనపై కలెక్టర్ సీరియస్..
విచారణకు ప్రత్యేక కమిటీ