
సమయపాలన పాటించాలి
ఎంజీఎం: సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. లష్కర్ సింగారం పీహెచ్‌సీ పరిధిలో టీబీ చికిత్స పొందుతున్న వారికి దాతల సహకారంతో పోషకాహార కిట్లను మంగళవారం డీఎంహెచ్‌ఓ అందించారు. ఈ సందర్భంగా పోషకాహార కిట్లను అందించిన దాతలను ఆయన అభినందించారు. అనంతరం పీహెచ్‌సీ పరిధి లో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. వాజ్‌పేయి కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం శాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్‌ను సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహె చ్‌ఓ డాక్టర్ మదన్మోహన్‌రావు, జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, వైద్యాధికారులు హైదర్, మౌనిక, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, సూపర్‌వైజర్ బాబు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి ఈనెల 12 నుంచి 20వ తేదీవరకు అమెరికా అధికార పర్యటన చేస్తారని రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం మంగళవారం తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీ అట్లాంటాలో నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫార్మసీ విభాగం చాప్టర్ సమ్మేళనంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, టెక్సాస్‌లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మకాలజీ అండ్ న్యూరో థెరిప్యూటిక్స్‌తో ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంటారని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం విద్య, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. రెండు విశ్వవిద్యాలయాల మధ్య పరిశోధనల మార్పిడి మరింతగా సులభతరం అవుతుందని తెలిపారు.
రామన్నపేట: నగరంలోని ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ మంగళవారం సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న సీపీకి మొక్క అందించి సిబ్బంది గౌరవ వందనంతో ఆహ్వానించారు. అనంతరం సీపీ స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రత, భద్రతా ఏర్పాట్లతోపాటు సిబ్బంది విధి నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరు, కేసుల నమోదు వివరాలను పరిశీలించారు. అదేవిధంగా స్టేషన్ పరిఽధిలో ముఖ్యమైన కేసులు, కాలనీల పరిస్థితులు, రౌడీషీటర్ల జాబితా తదితర వివరాలను స్టేషన్ ఇన్‌స్పెక్టర్ షుకూర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మరింత సమన్వయంతో వ్యవహరించి, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని సీపీ సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్‌సలీమా, ఏఎస్పీ శుభమ్, సిబ్బంది పాల్గొన్నారు.
న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదు నుంచి 9వ తరగతిలో ఉన్న ఖాళీలను ప్రవేశ పరీక్ష రాసిన మెరిట్ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి సీట్లను భర్తీ చేస్తామని సాంఘిక సంక్షేమ గురుకులాల సమన్వయ అధికారి పి.అపర్ణ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ఒరిజినల్ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 12న వరంగల్ జిల్లా పరిధి రాయపర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో హాజరు కావాలన్నారు. అదే రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఎస్‌సీ కేటగిరీ వారికి ప్రాధాన్యం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.