
అదనపు కట్నంకోసం వేధిస్తున్నారు
జఫర్‌గఢ్ : అదనపు కట్నం కోసం మూడేళ్ల నుంచి భర్త తనను కాపురానికి తీసుకు పోవడం లేదని బాధిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ఎదుట నిరసన దీక్ష చేపట్టిన సంఘటన మండలంలోని షాపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత మహిళ, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుర్చపల్లికి చెందిన గుర్రం శ్రావణిని జఫర్‌గఢ్ మండలం షాపల్లి గ్రామానికి చెందిన శివరాత్రి శ్రీకాంత్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఒప్పుకున్న మేరకు రూ.15లక్షల కట్నం పోను అదనంగా మరో రూ.15 లక్షలు కలిపి మొత్తంగా రూ.30లక్షలు ముట్టజెప్పారు. పెళ్లి తర్వాత రెండు నెలల పాటు శ్రీకాంత్–శ్రావణిల సంసారం సాఫీగా సాగింది. అనంతరం అదనపు కట్నం కోసం భర్త శ్రీకాంత్‌తో పాటు అత్త లక్ష్మి, మామ వెంకటేష్.. శ్రావణిని వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులు తట్టుకోలేక శ్రావణి పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి భర్త శ్రీకాంత్ తన భార్యను కాపురానికి తీసుకపోవడం లేదు. ఈ విషయంపై బాధిత మహిళ హైదరాబాద్‌లోని ఉప్పల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా శ్రీకాంత్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి శ్రావణిని కాపురానికి పంపారు. అయినా కూడా శ్రీకాంత్‌లో మార్పు రాకపోవడంతో మళ్లీ భార్యను వేధింపులకు గురి చేశాడు. హైదరాబాద్‌లో ప్లాట్ కొనిస్తేనే భార్యను కాపురానికి తీసుక పోతానంటూ లేనిచో తన ఇంటికి రావొద్దంటూ అతడితో పాటు తల్లిదండ్రులు కూడా ఆమెను వేధించారు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇటీవల రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయినా భార్యను తీసుకపోయేందుకు భర్త శ్రీకాంత్‌తో పాటు అత్తమామలు రాకపోవడంతో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలసి భర్త ఇంటికి వచ్చింది. ఇది గమనించిన అత్త, మామ ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో శ్రావణి కుటుంబ సభ్యులతో కలిసి మూడ్రోజుల నుంచి భర్త ఇంటి ఎదుట వంటావార్పు చేస్తూ అక్కడనే నిరసన దీక్ష చేస్తోంది. ఆమెకు గ్రామస్తులు కూడా అండగా నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత మహిళ కుటుంబ సభ్యులతో పాటు భర్త, అతడి తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య పోరాటం
మూడ్రోజులుగా భర్త ఇంటి ఎదుట నిరసన దీక్ష