
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
● మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలందించాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. కాజీపేటలోని సర్కిల్ కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో కలియ తిరుగుతూ అధికారులు, సిబ్బంది విధులకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిటిజన్ చార్టర్ ప్రకారం ఫైళ్లను సకాలంలో పరిష్కరించాలని చెప్పారు. కాజీపేట, కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయాల్లో మరుగుదొడ్లకు మరమ్మతులు చేసి నిర్వహణ చేపట్టాలన్నారు. కాజీపేట సర్కిల్ పరిధిలో రూ.28 కోట్ల నల్లా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ క్రమంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నెలరోజుల్లో రూ.10 కోట్లు వసూలు చేయాలని ఆదేశించారు. మూడు అద్దె భవనాలపై ఉన్న కోర్టు కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రెసిడెన్షియల్ నల్లాలుగా అనుమతులు పొంది కమర్షియల్‌గా వినియోగిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని మేయర్ హెచ్చరించారు. తనిఖీల్లో డిప్యూటీ కమిషనర్ గొడిశాల రవీందర్ గౌడ్, ఏసీపీ ప్రశాంత్, ఈఈలు రవికుమార్, శ్రీనివాస్, డీఈ సారంగం, టీపీఎస్‌లు రోజారెడ్డి, సుమన, ఏఈ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.