
సమయపాలన పాటించకపోతే చర్యలు
వరంగల్ అర్బన్ : ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటున్నామని, నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించకపోతే ఎందుకు?.. ఫైళ్లు పెండింగ్‌లో ఉండడం సరికాదని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం బల్దియా ప్రధాన కార్యాలయంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్, ప్రజా రోగ్యం, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, అర్బన్ మలేరియా, అకౌంట్ సెక్షన్, ట్రెజరీ, ఇన్‌వార్డు, కంట్రోల్ రూమ్ తదితర విభాగాలను అకస్మికంగా తనిఖీ చేశారు. అర్బన్ మలేరియా విభాగంలోని ఔట్ సోర్సింగ్ కార్మికుడు ఇయర్‌ఫోన్‌తో మాట్లాడుతున్న తీరును గుర్తించిన కమిషనర్ వివరాలు ఆరా తీసి నెల వేతనంలో కోత విధించాలని ఆదేశించారు. ప్రజారోగ్యం, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో సిబ్బంది లేకపోవడంపై ఆరా తీయగా, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికలో ఉన్నారని సిబ్బంది తెలియజేశారు. ఆయా అంతస్తులోని పలు విభాగాల్లో మరమ్మతులు నిర్వహించేందుకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని అదనపు కమిషనర్‌ను ఆదేశించారు. ఫేస్ ఆధారంగా బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తీసుకురావాలని ఐటీ విభాగం సిబ్బందికి సూచించారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజిరెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేష్, పర్యవేక్షకులు ఆనంద్, రామకృష్ణ, దేవేందర్, ఐటీ మేనేజర్ రమేశ్ తదితరులు ఉన్నారు.
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్